
మరణించడానికి కొన్ని నెలల ముందు, పీవీ నరసింహారావు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్‌లో బస చేశారు.
Jun 28 2026 12:21 PM | Updated on Jun 28 2026 12:21 PM
మరణించడానికి కొన్ని నెలల ముందు, పీవీ నరసింహారావు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్‌లో బస చేశారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు కనబడే హడావిడి ఎలా ఉండేదో ఒక విలే ఖరిగా నాకు తెలుసు.
నేనూ, ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్ ఆర్వీవీ కృష్ణారావు, గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం వెళ్లి, ఆ పని పూర్తిచేసుకున్న తరవాత, రాజ్ భవన్ గెస్ట్ హౌస్ మీదుగా తిరిగి వెడుతూ అటువైపు తొంగి చూశాము. సెక్యూ రిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించకపోవడంతో లోపలకు వెళ్ళాము. ‘పీవీ గారిని చూడటం వీలుపడుతుందా’ అని భద్రతాధికారిని అడిగాము. ‘లోపలకు వెళ్ళండి’ అన్నట్టు సైగ చేశాడు. ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టాము.
అంతే... మా ఆశ్చర్యం రెట్టింపయింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్‌బాల్ మాచ్ చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న ఫీలింగుతోనే, మమ్మల్ని పరిచయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకుని ఉన్న పీవీగారు నా వైపు చూస్తూ, ‘మీ అన్నయ్య పర్వతాలరావు ఎలా వున్నాడయ్యా!’ అని అడిగేసరికి నాకు మతి పోయినంత పనయింది. ఎప్పుడో దశాబ్దాల క్రితం, పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాష్ట్ర సమాచార శాఖలో పని చేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు ఆయనకు పీఆర్వోగా కొద్దికాలం పనిచేశారు. పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం.
అప్పటి విషయాలను గుర్తుపెట్టు కోవాల్సిన అవసరం ఆయనకు లేదు. అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ పీవీ గొప్పతనం. ఆ తరవాత కూడా ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానీ మాకు ‘కలయో వైష్ణవ మాయయో’ అన్నట్టుగా ఉంది. మేము కలసి కూర్చుంది, కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని వొంటి చేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ ఉండటం వల్ల, కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత, కొణిజేటి రోశయ్య వచ్చారు. ఆయన్ని చూడగానే పీవీ మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది. కాసేపు ఉండి మేము వచ్చేశాము.
అంతకుముందు పీవీని మరోసారి ఢిల్లీలో కలిశాను. రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెడుతూ అప్పుడు కేంద్రమంత్రిగా అత్యంత ఉచ్ఛస్థానంలో ఉన్న పీవీని కలుద్దామని వెళ్లాను. బంగ్లా అంతటా నిశ్శబ్దం. ఎవరో అటుగా వస్తే, ‘పీవీ గారిని కలవడానికి వీలుంటుందా’ అని హిందీలో అడిగాను. ఓ గది చూపించి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా తలుపు తోసి చూస్తే ఎదురుగా పీవీ. ఎవ్వరూ లేరు. పరిచయం చేసుకుని మాస్కో వెడుతున్నట్టు చెప్పాను. నా మొహంలో భావాలు పసికట్టినట్టున్నారు. ‘పనులు చేసి పెడుతూ ఉంటే కదా పదిమంది వచ్చేది’ అన్నారు.
‘మాస్కో ఎందుకయ్యా వేరే దేశంలో మీ రేడియో ఉద్యో గాలు లేవా? బాగా చలిదేశం. పెళ్ళాం పిల్లలతో ఎలా వుంటావు’ అని అడిగారు. చాలా ముక్తసరిగా మాట్లాడేవారని పేరున్న పీవీ, నేను వూహించని విధంగా చనువుగా ఆ రెండు ముక్కలు మాట్లాడ్డం నా అదృష్టం అనే భావిస్తాను. ఆయన మాజీ ప్రధానమంత్రిగా పాల్గొన్న ఒక సదస్సు హైదరాబాదులోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగింది. మధ్యాన్నం భోజన విరామ సమయంలో విలేఖరులు ఒక్కొక్కరుగా కలుస్తున్నారు. ఆలిండియా రేడియో ప్రాంతీయ విభాగంలో పనిచేసే ఆర్వీవీ కృష్ణారావు, నేనూ కాస్త వెనగ్గా నిలబడి ఉన్నాం. చివరికి ఆయనే మమ్మల్ని దగ్గరకు పిలిచారు.
‘ఏమయ్యా కృష్ణారావూ. ఢిల్లీలో పద్మనాభరావుకి కూడా చెప్పాను. ఏవయ్యా నా టేపులు?’ పీవీ ముఖ్యమంత్రిగా ఉన్న ప్పుడు తెలుగులో అనేక రేడియో ప్రసంగాలు చేశారు. వాటిని గురించి చేసిన వాకబు ఇది. కృష్ణారావు ఏదో చెప్పారు. ఆయన నా వైపు తిరిగారు. ‘మీ అన్నయ్య పుట్టపర్తిలో ఉంటున్నాడట కదా! ఏం చేస్తున్నాడు?’ ‘నరసింహావతారం గురించి పుస్తకాలు రాస్తున్నాడు.’ ‘అలా అయితే నేనడిగానని చెప్పు. మనిషి శారీరకంగా సింహం కంటే బలహీనుడు. ఆ అవతారంలో సింహం తలా, మనిషి శరీరం ఏమిటో రాయమని చెప్పు.’ నమస్కారం పెట్టి మేము వచ్చేశాము. - భండారు శ్రీనివాసరావు, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 28 - జూలై 05)
నిర్మాతగా అల్లు అర్జున్ ఫ్రెండ్.. 'జోకర్' మూవీ లాంచ్ (ఫొటోలు)
భాగ్యరాజ్‌కు నివాళి అర్పించిన కోలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)
తెరపై నవ్వు.. తెర వెనుక విజన్.. భాగ్యరాజ్ అరుదైన (ఫొటోలు)
మేడిపల్లి PS పరిధిలో దారుణం.. గృహప్రవేశం జరిగిన ఇంటిపై దాడి
200 భాషల్లో వారణాసి.. జక్కన్నను ఆకాశానికి ఎత్తేసిన ప్రియాంక
నువ్వు హోమ్ మినిస్టర్ గా ఉండి ఎవడికి ఉపయోగం... అనితపై కాకాని పూజిత సీరియస్
ఐర్లాండ్ చేతిలో ఓటమి.. ఫుల్ హ్యాపీలో ఫ్యాన్స్ ..అసలు కారణం ఇదే