
భారత బాహుబలి రాకెట్‌గా పేరొందిన ఎల్వీఎం-3కి మరింత బలం సమకూరబోతోంది. దీనికి అదనపు శక్తిని అందించే సరికొత్త సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ రూపకల్పనలో గణనీయ ముందడుగు పడింది.
చంద్రయాన్-3 వంటి ప్రతిష్ఠాత్మక ప్రయోగాలు నిర్వహించిన ఎల్వీఎం3 వాహకనౌకలోని కోర్దశలో ఎల్110 అనే ఇంజిన్‌ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఉపయోగిస్తోంది. దాని స్థానంలో సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ (ఎస్సీ120)ను వాడాలని లక్ష్యంగా పెట్టుకొని, అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. దాన్ని దశలవారీగా పరీక్షిస్తోంది. ఈ ఇంజిన్ ఉత్పత్తి చేయాల్సిన పూర్తి థ్రస్టు 200 టన్నులు కాగా.. గతంలో దాన్ని 47 శాతం, 60 శాతం సామర్థ్యంతో శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఇప్పుడు ఏకంగా 87 శాతాన్ని సాధించారు. అంటే 175 టన్నుల థ్రస్టు ఉత్పత్తయింది. పవర్ హెడ్ టెస్ట్ ఆర్టికిల్ (పీహెచ్టీఏ)తో ఈ పరీక్షను నిర్వహించారు. దీంతో పూర్తి సామర్థ్యమైన 200 టన్నుల శక్తి ఉత్పత్తిని సాధించే దిశగా మంచి పురోగతి సాధించినట్లయింది. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో ఈ పరీక్ష జరిగింది.
ప్రస్తుతం ఎల్వీఎం3లో వాడుతున్న ఎల్110 ద్రవ దశతో 169 టన్నుల శక్తి ఉత్పత్తవుతోంది. ఎస్సీ120 ద్వారా అది 200 టన్నులకు పెరగడం వల్ల మరింత ఎక్కువ బరువును వాహకనౌక మోసుకెళ్లగలదు. భూస్థిర బదిలీ కక్ష్యలోకి ప్రస్తుతం అది గరిష్ఠంగా 4 టన్నుల బరువున్న ఉపగ్రహాలను తరలించగలుగుతోంది. సెమీక్రయోజెనిక్ ఇంజిన్‌తో అది 5 టన్నులకు పెరుగుతుంది. భారత దీర్ఘకాల రోదసి పరిశోధన లక్ష్యాలకు ఇది ఊతమిస్తుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.