
ఓ అడవి జింకకు ఆహారం తినిపించడంతో అటవీ శాఖ ఉద్యోగి సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సత్పురా టైగర్ రిజర్వ్‌లో చోటుచేసుకుంది.
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ అడవి జంతువులకు ఆహారం పెట్టడంపై అటవీ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.
మధ్యప్రదేశ్: ఓ అడవి జింకకు ఆహారం తినిపించడంతో అటవీ శాఖ ఉద్యోగి సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సత్పురా టైగర్ రిజర్వ్‌లో చోటుచేసుకుంది. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ అడవి జంతువులకు ఆహారం పెట్టడంపై అటవీ శాఖ ఆగ్రహించింది. వన్యప్రాణి (సంరక్షణ) చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఉద్యోగిపై చర్యలు తీసుకుంది. ఉద్యోగి ఆహారం పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనను సస్పెండ్ చేశారు.
సత్పురా టైగర్ రిజర్వ్‌లోని బోరి రేంజ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్‌గా వినోద్ వర్మ పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన తన సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియో ప్రకారం.. చుర్నా అటవీ ప్రాంతంలో ఓ అడవి సాంబార్ జింకకు వినోద్ వర్మ పోహా తినిపిస్తూ కనిపించారు. ఆహారం పెడుతూ దానిని నిమురుతున్నారు. ఈ వీడియోపై వన్యప్రాణి సంరక్షణ కార్యకర్తలు, జంతు ప్రేమికులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన వన్యప్రాణుల సంరక్షణ చట్టం నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన వినోద్ వర్మను సస్పెండ్ చేస్తూ ఫీల్డ్ డైరెక్టర్ రాకేశ్ నందా ఆదేశాలు జారీ చేశారు. వినోద్ వర్మ విధి నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించారని, మధ్యప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (ప్రవర్తన) నియమావళి-1965లోని నిబంధన 3ను ఉల్లంఘించారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అడవి జంతువులకు అనవసరంగా ఆహారం పెట్టడం, వాటిని తాకడం వంటివి చేయకూడదని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల అవి మనుషులపై ఆధారపడటంతో పాటు మనపై ఉన్న సహజ భయాన్ని కోల్పోతాయని అంటున్నారు. దీంతో జంతువులు ఆహారం కోసం తరచుగా జనావాసాల్లోకి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీని వల్ల అవి ప్రమాదాలకు గురికావడంతో పాటు అక్రమ వేటకు బలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే మనుషులు ఇచ్చే ఆహారం, సన్నిహిత సాంగత్యం వాటి ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం చూపుతాయని వన్యప్రాణి నిపుణులు పేర్కొంటున్నారు.
ఇంత కన్ఫ్యూజ్ చేసే యాక్సిడెంట్‌ను ఎక్కడా చూసుండరు.. వీడియో వైరల్..