
Tamannaah Bhatia: దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ తమన్నా భాటియా మరోసారి తన భావోద్వేగ పోస్టుతో అభిమానుల మనసులు గెలుచుకుంది.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, జీవితంలో తనకు ముఖ్యమైన వ్యక్తులు, మధురమైన క్షణాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోవడం ఆమెకు అలవాటే. తాజాగా ఒక పెళ్లి వేడుకకు హాజరైన అనంతరం ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రముఖ నటి ఖుష్బూ కుమార్తె అవంతిక వివాహ వేడుక ఇటీవల గోవాలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తమన్నా కూడా ఈ వేడుకలో పాల్గొని అక్కడ తీసుకున్న ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. ఈ చిత్రాల్లో నటి త్రిషాతో కలిసి సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన తమన్నా అభిమానులను ఆకట్టుకుంది. ఇద్దరూ ధరించిన పట్టు చీరలు, ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అయితే ఫొటోల కంటే వాటికి తమన్నా రాసిన సందేశమే ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పెళ్లి వేడుక తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని ఆమె తెలిపింది. కొన్ని క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయని, అలాంటి అనుభూతినే ఈ వేడుకలో పొందానని పేర్కొంది.అలాగే జీవితంలో కొన్ని బంధాలు ఎప్పటికీ మారవని తమన్నా చెప్పింది. కొందరు వ్యక్తులు మనకు దూరంగా ఉన్నా, తరచూ కలవకపోయినా వారి స్థానం మన హృదయంలో ఎప్పటికీ అలాగే ఉంటుందని ఆమె భావోద్వేగంగా రాసుకొచ్చింది. నిజమైన స్నేహితులు కాలక్రమంలో కుటుంబ సభ్యుల్లా మారిపోతారని కూడా ఆమె పేర్కొంది.
వేడుకలో జరిగిన సరదా సంఘటనలను గుర్తు చేసుకుంటూ అందరితో కలిసి గడిపిన ప్రతి క్షణాన్ని ఎంతో ఆస్వాదించినట్లు తెలిపింది. ప్రముఖ కొరియోగ్రాఫర్లు సుందరం మాస్టర్, బ్రిందాతో కలిసి దిగిన ఫొటోలను కూడా అభిమానులతో పంచుకుంది. వేడుకను అందంగా నిర్వహించినందుకు సుందరం మాస్టర్‌ను ప్రత్యేకంగా అభినందించింది.
ఇంకా ఒక ఆసక్తికర విషయం కూడా తమన్నా వెల్లడించింది. ఈ వేడుకలో తాను స్వయంగా రూపొందించిన ఆభరణాలను ధరించినట్లు చెప్పింది. తన డిజైన్ చేసిన నగలను ఇలాంటి ప్రత్యేక సందర్భంలో ధరించడం ఎంతో ఆనందంగా అనిపించిందని తెలిపింది.
ప్రస్తుతం తమన్నా షేర్ చేసిన ఫొటోలు, ఆమె రాసిన భావోద్వేగ సందేశం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వస్తున్నాయి. అభిమానులు ఆమె మాటలను ప్రశంసిస్తూ, నిజమైన స్నేహం మరియు బంధాల విలువను గుర్తు చేసే సందేశమని కామెంట్లు చేస్తున్నారు.