పాకిస్థాన్‌లోని కరాచీలో భారీ పేలుడు సంభవించింది. దాని నుంచి తేరుకునే లోపే కాల్పులతో విరుచుకుపడ్డారు. కరాచీలోని గులిస్థాన్ - ఏ - జొహర్ ప్రాంతంలో ఉన్న పాకిస్థాన్ సింధ్ రేంజర్స్ కార్యాలయం వద్ద ఈ ఘటన...
పాకిస్థాన్‌లోని కరాచీలో భారీ పేలుడు సంభవించింది. దాని నుంచి తేరుకునే లోపే కాల్పులతో విరుచుకుపడ్డారు. కరాచీలోని గులిస్థాన్ - ఏ - జొహర్ ప్రాంతంలో ఉన్న పాకిస్థాన్ సింధ్ రేంజర్స్ కార్యాలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక మీడియా ప్రకారం.. ఈ దాడిలో సింధ్ రేంజర్స్‌కు చెందిన ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. పేలుడు తర్వాత సుమారు 15 నిమిషాల పాటు భారీగా కాల్పులు జరిగాయని తెలుస్తోంది. భారీ పేలుడు సంభవించడంతో భూమి ఒక్కసారిగా కంపించినట్లు స్థానికులు చెప్పారు. తొలుత ఏదైనా భూకంపం వచ్చిందా అనిపించిందని, తర్వాత బయటకు వచ్చి చూస్తే కాల్పులు ప్రారంభమయ్యాయని మసీదులో నమాజ్ చేస్తున్న వ్యక్తులు తెలిపారు. పేలుడు సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ 112 సింధ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా ఘటనపై వెంటనే స్పందించారు. పేలుడు, కాల్పులపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు. సింధ్ పోలీసు ఐసీ, కరాచీ అదనపు ఐజీతో మాట్లాడి ఘటనపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని సూచించారు. కరాచీ పోలీసులు, భద్రతా బలగాలు ఘనా స్థలానికి చేరుకుని ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.పాకిస్థాన్‌లోని కీలక ప్రాంతాల్లో కరాచీ ఒకటి. కరాచీలో ఇలాంటి దాడులు జరగడం చాలా అరుదు. చివరిసారిగా 2024 అక్టోబర్‌లో చైనా పౌరులు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై బాంబు దాడి జరిగి, అందులో ఇద్దరు చైనీయులు మరణించారు. అయితే, గత కొంతకాలంగా పాకిస్థాన్ - అప్ఘనిస్థాన్ మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు. తాజాగా బలోచిస్థాన్‌లోని పాక్ సరిహద్దు ప్రాంతంలో అప్ఘన్ ఎయిర్ స్ట్రైక్ చేసినట్టు కూడా ఆ దేశమే అధికారికంగా వెల్లడించింది. పాకిస్థాన్ ప్రముఖ నగరాల్లో హింసాత్మక ఘటనలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం పేలుడుకు కారణాలు ఎవరనే విషయాన్ని పాకిస్థాన్ ప్రకటించలేదు. దాడి వెనుక ఉన్నవారిపై భధ్రతా సంస్థలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.