
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సన్నిహితుడు, 'శాండీ'గా సినీ ఇండస్ట్రీలో సుపరిచితుడైన సందీప్ రామినేని చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.
'మీరా ప్రొడక్షన్స్' పేరుతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించిన ఆయన, 'జోకర్' అనే టైటిల్‌తో తన తొలి చిత్రాన్ని శనివారం అధికారికంగా ప్రారంభించారు.హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ కెమెరా స్విచ్చాన్ చేశారు. ప్రముఖ నిర్మాత బన్నీ వాసు చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్‌ను అందజేశారు.మౌర్య సిద్ధవరం, తన్వి ఆకాంక్ష హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి గీతా సి. శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. హాస్యం, భావోద్వేగాల మేళవింపుతో పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా దీనిని రూపొందిస్తున్నారు. ఆగస్టు నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.ఈ సందర్భంగా నిర్మాత సందీప్ రామినేని మాట్లాడుతూ.. దర్శకురాలు గీతా సి. శేఖర్ అద్భుతమైన కథను సిద్ధం చేశారని, ఈ సినిమాపై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.