
ఎప్పుడో ముత్తాతల కాలంలో ప్రారంభమైన భూ వివాదం ఎట్టకేలకు సుప్రీంకోర్టులో పరిష్కారమయింది. 15.5 బీఘాల (9.68ఎకరాలు) భూమి విషయమై 1957లో మొదలయిన కేసుపై ధర్మాసనం నాలుగో తరానికి చెంది
న భూమి యజమానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
న్యూఢిల్లీ, జూన్ 27: ఎప్పుడో ముత్తాతల కాలంలో ప్రారంభమైన భూ వివాదం ఎట్టకేలకు సుప్రీంకోర్టులో పరిష్కారమయింది. 15.5 బీఘాల (9.68ఎకరాలు) భూమి విషయమై 1957లో మొదలయిన కేసుపై ధర్మాసనం నాలుగో తరానికి చెందిన భూమి యజమానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సేల్ డీడ్‌పై సంతకం పెట్టిన సాక్షి నివాసం విషయంలో తేడా ఉండడంతో సమస్య సుప్రీంకోర్టు వరకు వచ్చింది. ఉత్తరాఖండ్‌లోని నర్సిపూర్ కలాన్ గ్రామానికి చెందిన సరాఫత్ ఆలీ పూర్వీకులు 1957 జూన్ 4న ఆ భూమిని కొనుగోలు చేశారు. మైనర్లయిన తమ పిల్లల పేరున రాశారు. 1984లో మ్యుటేషన్ జరిగింది. యూపీ జమిందారీల రద్దు, భూసంస్కరణల చట్టం సెక్షన్ 154కు అనుగుణంగా సేల్ డీడ్ లేదని, అందువల్ల ఆ అమ్మకం చెల్లదని కొందరు హైకోర్టులో అప్పీలు చేశారు. ఆ నిర్ణయాన్ని సమర్థిస్తూ 2017లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. చివరకు సరాఫత్ సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. సేల్ డీడ్‌పై సాక్షి సంతకం చేసిన బారు అనే వ్యక్తి నివాసం విషయంలో తేడా ఉండడంతో దానిపై హైకోర్టు సహా అధికార యంత్రాంగాలు అనుమానాలు వ్యక్తం చేసి అప్పీళ్లను కొట్టివేశాయి. సేల్ డీడ్‌లో బారు... ‘నిహాంద్పూర్ సుతారి’ గ్రామ వాసి అని పేర్కొనగా, 1995లో ఇచ్చిన స్టేట్మెంట్లో మాత్రం ‘నాసిర్పూర్ కలాన్’ గ్రామ వాసి అని ఉంది. అందువల్ల సేల్‌డీడ్ చెల్లదని పేర్కొన్నాయి. కానీ ఈ అభిప్రాయంతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. గ్రామం పేరులో తేడా ఉందని అభ్యంతరం చెప్పారే తప్ప, సేల్‌డీడ్ నకిలీదనిగానీ, ఫోర్జరీ సంతకాలు చేశారనిగానీ, బలవంతంగా సంతకాలు చేశారనిగానీ ఎవరూ సవాలు చేయని విషయాన్ని ప్రస్తావించింది. అది మోసపూరితమని ఎవరూ ఆరోపించనందున, రిజిస్టర్ అయిన సేల్‌డీడ్‌ను చిన్న చిన్న తప్పిదాలతో రద్దు చేయలేరని స్పష్టం చేసింది. కొనుగోలు చేసినప్పటి నుంచి 69 ఏళ్లుగా ఆ భూమి వారి ఆధీనంలో ఉండడాన్ని కూడా బలమైన కారణంగా పేర్కొని అనుకూలంగా తీర్పు ఇచ్చింది.