
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ప్రధాన పాత్రలో కె. భాగ్యరాజ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆఖ్రీ రాస్తా’ (Aakhree Raasta 1986).
ఈ సినిమాను అంతకు ముందే తమిళంలో ‘ఒరు కైధియిన్ డైరీ’(1984)గా భారతీరాజా తెరకెక్కించారు. అయితే, ఈ మూవీ ప్రాజెక్టును హిందీలో చేద్దామని నిర్మాత పూర్ణచందర్రావు భావించారు. ఈ మూవీ చిత్రీకరణ మొదలుపెట్టేటప్పుడు అమితాబ్‌కు చిన్న అనుమానం ఉండేది. ‘కామెడీలు తీసే ఈ డైరెక్టర్, నా యాక్షన్ ఇమేజ్‌ని సరిగ్గా హ్యాండిల్ చేయగలరా?’అని. కానీ పూర్ణచందర్రావు భాగ్యరాజ్ ప్రతిభపై నమ్మకంతో అమితాబ్‌ను ఒప్పించారు. షూటింగ్ మొదలయ్యాక అమితాబ్ తనదైన శైలిలో డైరెక్టర్‌ను పరీక్షించారు. తొలి రోజే స్క్రిప్ట్ చేతిలో ఉన్నా, ప్రతి సీన్‌ను భాగ్యరాజ్ ఎలా తీస్తారో వివరంగా చెప్పమన్నారు. ఆయన వివరణ విన్నాక అమితాబ్ ‘మీరు చెప్పేది అర్థమైంది, ఇక నేను చేయగలను’ అని ఒక ఒబీడియంట్ స్టూడెంట్‌లా మారిపోయారు. భాగ్యరాజ్‌కు హిందీ రాదు, అందుకే తమిళంలో రాసిన స్క్రిప్ట్‌ను అనువదించి, ప్రతి రోజూ ఆ సీన్లను ఆయనే స్వయంగా నటిస్తూ చూపించేవారు. ఇది అమితాబ్‌కు కూడా సరదాగా అనిపించేది.
ఈ సినిమా షూటింగ్లో ఒక కీలక సన్నివేశంలో భాగ్యరాజ్-అమితాబ్ మధ్య వాగ్వాదం జరిగింది. సినిమాలోని ఓ సన్నివేశంలో, సమాధి దగ్గర తండ్రీ కొడుకుల మధ్య జరిగే సంభాషణ ఇంగ్లీషులో ఉండాలని భాగ్యరాజ్ పట్టుబట్టారు. ‘ఇంత కీలకమైన సీన్లో ఇంగ్లీషు మాట్లాడితే హిందీ ప్రేక్షకులు ఎలా అర్థం చేసుకుంటారు?’ అని అమితాబ్ అభ్యంతరం చెప్పారట. కానీ చివరకు ఆ సన్నివేశాన్ని భాగ్యరాజ్ చెప్పినట్టుగానే ఇంగ్లీషులో చిత్రీకరించారు. సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల స్పందన చూసి అమితాబ్ ఆశ్చర్యపోయారు. తండ్రీ కొడుకులు ఇంగ్లీషులో మాట్లాడుతుంటే థియేటర్లలో మంచి స్పందన వచ్చింది. వెంటనే అర్థరాత్రి భాగ్యరాజ్‌కు ఫోన్ చేసి, ‘సర్, మీరు చెప్పింది కరెక్ట్. ఇంగ్లీషు డైలాగ్స్ చెప్పినప్పుడే ప్రేక్షకులు బాగా రియాక్ట్ అయ్యారు. ప్రేక్షకులు దేనికి ఎలా స్పందిస్తారో మీకు బాగా తెలుసు’ అని అభినందించారు. జయప్రద, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘ఆఖ్రీ రాస్తా’ అమితాబ్ కెరీర్లో మైలురాయిగా నిలిచింది. ద్విపాత్రాభినయంలో ఆయన నటన ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది.
అయితే, ‘ఆఖ్రీ రాస్తా’ విడుదలై 33 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2019లో అమితాబ్ బచ్చన్ ఆ సినిమా అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ఓ అభిమాని సోషల్ మీడియాలో ‘ఆఖ్రీ రాస్తా’లో మీ నటన అద్భుతం అని ప్రశంసించడంతో అమితాబ్ స్పందించారు. ‘ధన్యవాదాలు. ఇది గొప్ప అనుభవం. కె. భాగ్యరాజ్ నాకు కొత్త వ్యక్తి, కానీ ఆయన దర్శకత్వం చాలా గొప్పగా అనిపించింది’ అని ట్వీట్ చేశారు. భాగ్యరాజ్‌పై మొదట అనుమానం వ్యక్తం చేసిన అమితాబ్.. చివరకు ఆయన దర్శకత్వ ప్రతిభను బహిరంగంగా మెచ్చుకోవడం విశేషం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.