అమరావతిలో వైసీపీ నేతలపై జరిగిన దాడిని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక గూండాల రాజ్యం నడుపుతున్నారా?
అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. రాజధాని రైతుల ఆహ్వానం మేరకు సీఆర్డీయే పరిరక్షణ కమిటీతో కలిసి వైసీపీ నేతలు అక్కడికి వెళ్లారని.. వారిపైనే దాడులు చేయిస్తారా అంటూ నిలదీశారు. "పట్టపగలు ప్రజాస్వామాన్ని ఖూనీచేస్తారా? రైతుల కష్టాలు, అమరావతి పేరుతో మీరు చేస్తున్న అవినీతి, దోపిడీ, రైతులపై దౌర్జన్యాలు బయటకు రానీయకుండా ఉండేందుకే ఇలాంటి దారుణాలు చేస్తారా? ఇది స్వయంగా మీరు ఉసిగొల్పిన దాడికాదా ? పోలీసులు ఉన్నది భద్రత కల్పించడానికా? లేక అరాచకాలకు, దాడులకు కాపలా కాయడానికా? ఒకరిద్దరు పోలీసు అధికారులు దగ్గరుండి ఈ దాడిని కో-ఆర్డినేట్ చేయడం అత్యంత దారుణం." అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అమరావతి పేరుతో ప్రభుత్వం చేస్తున్న దారుణాలకు బలైపోతున్న రైతులకు తోడుగా నిలవడం తప్పా అని ఎస్ జగన్ ప్రశ్నించారు. భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసుల పేరుతో వేధిస్తున్నారని.. వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీచేస్తున్నారని.. కొండవీటి వాగును నీటిని వారి భూముల్లోకి బలవంతంగా మళ్లించారని ఆరోపించారు. భూములు ఇవ్వని రైతులకు గత్యంతరంలేని పరిస్థితులను కల్పించి, భూములు ఇవ్వకపోయినా, రిటర్న్‌బుల్ ప్లాట్లకింద వారి పొలాలను అనుమతి లేకుండానే రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారని ఆరోపించారు. రైతులు కన్నీరు పెడుతుంటే, వారి గోడు విని వారికి భరోసా కల్పించే ప్రయత్నం తాము చేస్తుంటే మీ వాళ్లచేత రౌడీయిజం చేయిస్తారా అంటూ జగన్ చంద్రబాబును ప్రశ్నించారు. అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారన్న వైఎస్ జగన్.. ఇంకా ఎందుకు, ఎవరి కోసం కావాలని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రాన్ని జంగిల్ రాజ్‌గా మార్చారన్న జగన్.. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజా గొంతుకలను అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు.రోజురోజుకూ చంద్రబాబు దుర్మార్గాలు రెట్టింపు అవుతున్నాయన్న జగన్.. రేపు రెట్టింపు స్పందన ఉంటుందంటూ హెచ్చరించారు. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తారని హెచ్చరించారు. మీ దాడులకు వైసీపీ భయపడదని.. తలవంచదని జగన్ స్పష్టం చేశారు. అమరావతి పేరుతో రైతులను పెడుతున్న ఇబ్బందులను, అవినీతిని, ఎండగడుతూనే ఉంటామని.. వారి పక్షాన నిలబడుతూ తోడుగా నిలుస్తామని జగన్ స్పష్టం చేశారు.