విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని విశాఖ కలెక్టర్ అభిషిక్త కిషోర్ వెల్లడించారు.
విశాఖపట్నం భోగాపురం విమానాశ్రయాన్ని అనుసంధానం చేసేందుకు ఏడు రహదారులు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడింటిలో ఐదు రోడ్లను పూర్తిచేసినట్లు విశాఖపట్నం కలెక్టర్ వెల్లడించారు. అలాగే విశాఖపట్నం నుంచి ఆర్టీసీ బస్సులను సైతం నడపనున్నట్లు వివరించారు. భోగాపురం విమానాశ్రయం కోసం డెడికేటెడ్ బస్ బే ఏర్పాటు చేస్తామని తెలిపారు. మరోవైపు భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో.. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు కొనసాగుతుందా లేదా అనే అనుమానాలపై కలెక్టర్ క్లారిటీ ఇచ్చారు. విశాఖ విమానాశ్రయం కొనసాగుతుందన్న విశాఖపట్నం కలెక్టర్.. కార్యకలాపాలు మాత్రం భోగాపురం విమానాశ్రయం నుంచి కొనసాగుతాయని వెల్లడించారు. మరోవైపు భోగాపురం ఎయిర్‌పోర్టులో జూలై ఎనిమిదో తేదీ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. విమాన ప్రయాణికుల టికెట్లపై యూడీఎఫ్ ఛార్జీలు వసూలు చేస్తుంటారు. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి టెంపరరీ యూడీఎఫ్ టారిఫ్‌ను ఎయిర్‌పోర్టు రెగ్యులేటరీ అథారిటీ తాజాగా విడుదల చేసింది. భోగాపురం నుంచి బయల్దేరే డొమెస్టిక్ ప్యాసింజర్లకు రూ.835, భోగాపురం విమానాశ్రయానికి చేరుకునేవారికి రూ.355.. యూడీఎఫ్ ఛార్జీలు వసూలు చేస్తారు. అదే ఇంటర్నేషనల్ ప్యాసింజర్లు అయితే భోగాపురం నుంచి బయలుదేరే వారికి రూ.1,255, భోగాపురానికి వచ్చేవారికి రూ.545గా టెంపరరీ యూడీఎఫ్ ఛార్జీలు నిర్ణయించారు.మరోవైపు విశాఖ విమానాశ్రయం.. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో చిన్న సైనిక విమాన స్థావరంగా ప్రారంభమైంది. 1941లో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవసరాల కోసం నాటి బ్రిటిషర్లు ఈ విమాన స్థావరాన్ని నిర్మించారు.1954లో ఇక్కడి నుంచి పౌర విమాన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 1981 సంవత్సరం నుంచి పూర్తి స్థాయి వాణిజ్య విమాన సేవలు ప్రారంభమయ్యాయి.సుమారుగా 80 ఏళ్లపాటు సేవలు అందించిన విశాఖపట్నం ఎయిర్ పోర్టు.. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తూ ఉండటంతో నేవీ చేతుల్లోకి వెళ్లనుంది. వ్యూహాత్మక భద్రతా కారణాల నేపథ్యంలో 1986లో విశాఖపట్నం విమానాశ్రయం నౌకాదళం నియంత్రణలోకి వచ్చింది.