దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న పుణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో ఒక దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అదే సమయంలో, నింది
తులు సియా గోయల్ , ఆమె ప్రియుడు చేతన్ చౌదరి జీవితాలకు సంబంధించిన వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జూన్ 18న లోహగఢ్ కోట వద్ద కొండపైనుంచి పడి కేతన్ మరణించారు. అతడ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో కాబోయే భార్య సియా గోయల్.. ప్రియుడు చౌదరితో కలిసి ఈ హత్యకు పథకం వేసిందని పోలీసులు ఆరోపిస్తున్నారు.తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని కుటుంబానికి చెప్పి, రద్దు చేసుకోవడం కంటే, అగర్వాల్‌ను చంపడమే ‘సులభం’ అనిపించిందని విచారణలో గోయల్ ఒప్పుకున్నట్లు పుణె రూరల్ పోలీస్ వర్గాలు తెలిపాయి. తన కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీయడం ఇష్టం లేక, పెళ్లిని రద్దు చేసుకోవడం కంటే తన కాబోయే భర్తను చంపడానికే మొగ్గు చూపినట్లు ఆమె వెల్లడించినట్లు వారు తెలిపారు. అయితే, కేతన్ అగర్వాల్‌ను హత్యచేయడానికి సియా పలుసార్లు వేసిన పథకం విఫలమై.. చివరకు జూన్ 18న లోహగఢ్ కోటపై నుంచి లోయలోకి తోసి చంపినట్టు ఆరోపణలు ఉన్నాయి.ఈ హత్య కేసు దర్యాప్తు కోసం పుణె, లోనావాలా పోలీసులు ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం, గోయల్ తల్లిదండ్రులు విచారణ నిమిత్తం లోనావాలా సిటీ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఆమె సోదరుడు సాహిల్‌ను కూడా రెండోసారి విచారిస్తున్నారు. శుక్రవారం అతడ్ని 10 గంటల పాటు పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తనకు చేతన్ చౌదరి తెలుసని, ఓ క్రికెట్ మ్యాచ్ సమయంలో పరిచమైందని తెలిపాడు. ఈ ఏడాది జనవరి నుంచి ఇరువురి మధ్య 2000కిపైగా కాల్స్ జరిగాయని, మొత్తం 238 గంటలు మాట్లాడుకున్నారని గుర్తించారు.హత్య కేసులో వారిద్దరి పాత్రలను నిర్ధారించామని, కుట్ర కోణాన్ని నిరూపించేందుకు వారి మొబైల్ ఫోన్ల నుంచి తొలగించిన డేటాను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. రెండు కుటుంబాల మధ్య వివాహాన్ని ఖరారు చేసిన మధ్యవర్తులను కూడా దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నారు.