Supreme Court Homebuyers Relief : దేశవ్యాప్తంగా సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే లక్షలాది మంది మధ్యతరగతి కొనుగోలుదారులకు సుప్రీం కోర్టు ఒక అత్యంత తీపి కబురు అందించింది.
రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి ఫ్లాట్ లేదా ఇంటిని స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా.. ఆ డెలివరీలో జరిగిన ఆలస్యానికి పరిహారం డిమాండ్ చేసే హక్కు కొనుగోలుదారులకు ఉంటుందని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇల్లు చేతికొచ్చినంత మాత్రాన రియల్టర్ల వైఫల్యాలపై ప్రశ్నించే హక్కును వినియోగదారులు కోల్పోరని తేల్చి చెప్పింది.జాతీయ కమిషన్ పాత ఆదేశాలు కొట్టేసిన సుప్రీం..ఢిల్లీకి చెందిన ఒక కోఆపరేటివ్ గ్రూప్ హౌసింగ్ సొసైటీలో 2003వ సంవత్సరంలో సభ్యుడిగా చేరి.. ఫ్లాట్ కొనుగోలు చేసిన ఒక వ్యక్తి దాఖలు చేసిన అప్పీల్‌పై సుప్రీం కోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం.. గతంలో నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రీడ్రెసల్ కమిషన్ (ఎన్సీడీఆర్సీ) 2016లో ఇచ్చిన వివాదాస్పద ఉత్తర్వులను పూర్తిగా పక్కనబెట్టింది. నాడు జాతీయ కమిషన్ వినియోగదారుడికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు చెల్లదని సుప్రీం కోర్టు పేర్కొంది.ఇల్లు స్వాధీనం చేసుకున్నంత మాత్రాన హోదా పోదు!బిల్డర్ నుంచి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండానే ఫ్లాట్ స్వాధీనం చేసుకున్నందున.. ఫిర్యాదు చేసే సమయానికి సదరు వ్యక్తి వినియోగదారుడు కాదంటూ ఎన్సీడీఆర్సీ అప్పట్లో చేసిన వాదనను సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఫ్లాట్ డెలివరీ తీసుకోవడం కంటే ముందే కన్స్యూమర్ ఫోరంలో కేసు వేయాలనే నియమమేదీ లేదని కోర్టు వివరించింది. ముందే ఇంటిని స్వాధీనం చేసుకున్నారనే సాంకేతిక కారణంతో పిటిషనర్‌ను వినియోగదారుల జాబితా నుంచి మినహాయించకూడదని జాతీయ కమిషన్‌కు గట్టిగా సూచించింది.మధ్యవర్తిత్వ నిబంధన ఉన్నా.. కన్స్యూమర్ కోర్టుకు వెళ్లొచ్చుఇల్లు కొనేటప్పుడు ఇరుపక్షాల మధ్య కుదిరిన ఒప్పంద పత్రాలలో.. ఒకవేళ మధ్యవర్తిత్వ నిబంధన ఉన్నప్పటికీ.. కొనుగోలుదారుల హక్కులకు ఎలాంటి భంగం కలగదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒప్పందంలో సదరు నిబంధన ఉన్నంత మాత్రాన వినియోగదారుల ఫోరంలో అప్పీలుదారు దాఖలు చేసిన ఫిర్యాదును తిరస్కరించడానికి వీళ్లేదని తేల్చి చెప్పింది. వినియోగదారులకు కొనుగోలు చేసిన ఇండ్ల్లలో లేదా రియల్ ఎస్టేట్ బిల్డర్లు అందించే సేవల్లో లోపాలుఎదురైతే.. వాటిపై ఫిర్యాదు చేయడానికి 'వినియోగదారుల రక్షణ చట్టం-1986'ను సంపూర్ణంగా ఉపయోగించుకోవాలని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా పిలుపునిచ్చింది. బాధితులకు అత్యంత వేగవంతమైన, పారదర్శకమైన న్యాయ పరిష్కారాన్ని అందించడమే ప్రాథమిక లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్లు ధర్మాసనం గుర్తు చేసింది.