
2005 Before Notes News: సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక న్యూస్ వైరల్గా మారుతూ ఉంటుంది. తాజాగా భారత కరెన్సీ నోట్ల వినియోగంపై ఓ కీలక పుకారు వైరల్ అవుతోంది.
పాత కరెన్సీ నోట్లు ఇకపై చెల్లవని పుకార్లు వస్తున్న వేళ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర క్లారిటీ ఇచ్చింది.
సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక విషయం గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. అందులోనూ 2016లో నోట్ల రద్దు తర్వాత కరెన్సీ నోట్ల వాడకంపై ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. తాజాగా కరెన్సీ నోట్ల వాడకంపై మరో కొత్త పుకారు తెరపైకి వచ్చింది.
కరెన్సీ నోట్లకు సంబంధించి తరచూ వచ్చే పుకార్లపై తాజాగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్పందించింది. 2005 కంటే ముందు ముద్రించిన నోట్లు చెల్లవంటూ జరుగుతున్న ప్రచారంలో అస్సలు నిజం లేదని తేల్చి చెప్పింది.
జూన్ 30 తర్వాత 2005 కంటే ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్వీకరించదంటూ ఒక సర్క్యులర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో సామాన్య ప్రజల్లో గందరగోళం నెలకొంది.
ఈ వార్తలపై బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారికంగా స్పందిస్తూ.. ఆ సర్క్యులర్ ముమ్మాటికీ ఫేక్ (తప్పుడు సమాచారం) అని స్పష్టం చేసింది. 2005కు ముందు నాటి నోట్లను జూన్ 30 తర్వాత కూడా బ్యాంక్ శాఖల్లో యథావిధిగా స్వీకరిస్తారని పేర్కొంది.
ఇలాంటి తప్పుడు సందేశాలను ఎవరూ నమ్మవద్దని, ఇతరులకు షేర్ చేయవద్దని ఖాతాదారులను కోరింది. బ్యాంకింగ్ అంశాలకు సంబంధించి కేవలం అధికారిక ఛానళ్ల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది.
గమనిక: నెట్టింట్లో వైరల్ అయ్యే ఇలాంటి వార్తలను నిర్ధారించుకోకుండా ఫార్వార్డ్ చేయకండి. ఆర్బీఐ లేదా సంబంధిత బ్యాంకుల అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మండి.