
Amaravati Tension: అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఆర్డీఏ పరిరక్షణ బృందం పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది.
తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్ వద్ద వైసీపీ నేతలు పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు రాజధాని భూములను పరిశీలించేందుకు వెళ్తుండగా, టీడీపీ సానుభూతిపరులు, రాజధాని రైతులు వారిని అడ్డుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా “గో బ్యాక్ వైసీపీ” అంటూ నినాదాలు చేస్తూ నల్ల బ్యాడ్జీలతో ఆందోళన నిర్వహించారు.దీంతో, ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై కోడిగుడ్లు విసిరిన ఘటన చోటుచేసుకుంది. అలాగే లేళ్ల అప్పిరెడ్డి ప్రయాణిస్తున్న కారుపై రాళ్లు రువ్వడంతో వాహనం ధ్వంసమైనట్లు సమాచారం.
మరోవైపు ఘటనను అదుపు చేసేందుకు పోలీసులు జోక్యం చేసుకున్నప్పటికీ ఉద్రిక్తత కొనసాగింది. ఈ క్రమంలో పోలీసులపై కూడా రాళ్లు రువ్వినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు పోలీసు సిబ్బంది గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉండవల్లి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటనతో రాజధాని ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తత మరోసారి తెరపైకి వచ్చింది.