
జీవితంలో డబ్బు సంపాదించడం చాలా ముఖ్యం. అయితే.. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమూ.. దానిని తెలివిగా ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం. ఖర్చు చేసిన రూపాయి తిరిగి సంపాదించడం చాలా కష్టం అని..
జాగ్రత్తగా ఖర్చు చేయాలి అని చెబుతుంటారు. అయితే.. చాణక్యుడు మాత్రం.. వేటికి డబ్బులు ఖర్చు చేసినా , చేయకపోయినా మూడింటికి మాత్రం కచ్చితంగా ఖర్చు చేయాలని చెబుతున్నాడు. ఈ మూడు విషయాల్లో డబ్బులు ఖర్చు చేస్తే మాత్రం.. ఆదాయం రెట్టింపు అవుతుంది. అవేంటి? వేటిలో ఆదాయం పెడితే.. డబ్బు పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
డబ్బు సంపాదించడం అంటే.. వచ్చిన జీతాన్ని,ఆదాయాన్ని దాచిపెట్టడం కాదు.. దానిని సరైన చోట పెట్టుబడి పెట్టాలి. సరైన చోట పెట్టుబడి పెడితే.. ఆదాయం పెరిగుతుంది. ముఖ్యంగా మూడు విషయాల్లో డబ్బులు ఖర్చు చేసిన వాళ్లకు డబ్బు ఎప్పుడూ వృథా కాదు. పైగా ఏదో ఒక రూపంలో మీ సంపదను పెంచుతుంది.
చాణక్యుని ప్రకారం, విద్య కోసం చేసిన ఖర్చు ఎప్పటికీ వృథా కాదు. డబ్బు, ఆస్తి కాలక్రమేనా పోవచ్చు. కానీ.. చదువు కారణంగా వచ్చిన జ్ఞానం ఎప్పుడూ వృథా అవ్వదు. కొత్త విషయాలు నేర్చుకోవడం, పుస్తకాలు చదవడం, నైపుణ్యాలను పెంచుకోవడం వంటి వాటిపై పెపట్టే పెట్టుబడులు భవిష్యత్తులో విజయానికి, కొత్త అవకాశాలు తెచ్చుకోవడానికి సహాయపడుతుంది. విద్య కోసం పెట్టిన ఖర్చు ఎప్పుడూ వృథా అవ్వదు.
చాణక్య నీతి ప్రకారం, దానధర్మాలు, ధర్మంపై ఖర్చు చేసే డబ్బు ఎన్నడూ వృథా కాదు. పేదలకు సహాయం చేయడం కేవలం సామాజిక బాధ్యత మాత్రమే కాదు, మానవ విలువలను పెంపొందించే ఒక మార్గం కూడా. పరోపకారంపై ఖర్చు చేసే డబ్బు మిమ్మల్ని సుసంపన్నం చేస్తుంది. వారి జీవితంలో మంచి సంబంధాలకు, సామరస్యానికి పునాది వేస్తుంది.
చాణక్యుడు ఆరోగ్యాన్ని జీవితంలో గొప్ప సంపదగా భావించాడు. శరీరం ఆరోగ్యంగా లేకపోతే, సంపద, హోదా, విజయం వంటి వాటిని అనుభవించడం అసంపూర్ణంగా మిగిలిపోతుంది. చాణక్య నీతి ప్రకారం, పౌష్టికరమైన ఆహారం, క్రమమైన ఆరోగ్య పరీక్షలు, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఖర్చు చేసే డబ్బు భవిష్యత్తును సురక్షితం చేసుకోవడంలో ఒక పెట్టుబడి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి మరింత సన్నద్ధంగా ఉంటాడు.