
బెంగళూరులో ఓ బైకర్పై చెట్టుకొమ్మ విరిగిపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. రాజాజీనగర్‌లోని రామ్ మందిర్ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో బాధితుడు కోమాలోకి వెళ్లినప్పటికీ, ప్రస్తుతం కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.వివరాల్లోకి వెళితే.. 52 ఏళ్ల సతీశ్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై పనికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మార్గమధ్యంలో అకస్మాత్తుగా ఓ ఎండు చెట్టు కొమ్మ విరిగి అతని తలపై పడింది. ప్రమాద సమయంలో సతీశ్ హెల్మెట్ ధరించకపోవడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. చెట్టు కొమ్మ బలంగా తగలడంతో సతీశ్ అదుపుతప్పి బైక్‌తో సహా కిందపడిపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం యశ్వంత్‌పూర్‌లోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు.తలకు తీవ్ర గాయం కావడంతో కోమాలోకి వెళ్లిన సతీశ్‌కు వైద్యులు అత్యవసరంగా సర్జరీ నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని, ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.డ్రైవింగ్ సమయంలో ప్రమాదం ఏటు నుంచి, ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. అందుకే బైక్ రైడింగ్ సమయంలో హెల్మెట్ పెట్టుకోవడం ఎంతో ముఖ్యమో ఈ ఘటన మరోసారి నిరూపించింది.