
ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన భద్రాద్రి ఆలయ మాస్టర్ ప్లాన్ కల సాకారమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. భద్రాద్రి క్షేత్ర అభివృద్ధి పనులకు నేడు శ్రీకారం చుట్టారు.
స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్ ఆలయ పరిసరాల్లో శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించి ఈ మెగా ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. భద్రాచలం రామాలయ రూపురేఖలను మార్చేలా మొత్తం రూ. 200.89 కోట్ల భారీ బడ్జెట్తో ఈ తొలి విడత అభివృద్ధి పనులను చేపట్టారు. ఆలయానికి తూర్పు, దక్షిణం, ఉత్తరం వైపు ఉన్న పాత నిర్మాణాల తొలగింపు పనులు ఈరోజు ప్రారంభమయ్యాయి.
ఆలయ పరిసరాల క్లియరెన్స్ పూర్తయిన తర్వాత... ప్రభుత్వం సిద్ధం చేసిన కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం పూర్తి శాస్త్రోక్తంగా, ఆగమ శాస్త్ర నియమాలను పాటిస్తూ అభివృద్ధి పనులు చేపడతారు. వచ్చే సంవత్సరం శ్రీరామ నవమి పండుగ నాటికి ఈ ఆలయ నిర్మాణ పనులన్నింటినీ పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.