
Tamil Nadu Minister| ఇంటర్నెట్‌డెస్క్: తమిళనాడు మానవవనరుల శాఖమంత్రి డి.శరత్‌కుమార్ (D Sarathkumar) వివాదంలో చిక్కుకున్నారు. ఆయన వద్ద డ్రగ్స్ ఉన్నాయంటూ ఆరోపణలు వచ్చాయి.
కొన్నేళ్ల క్రితం నాటి వీడియో వైరల్ కావడంతో ఈ విమర్శలు వ్యక్తంకాగా.. అది మెడిసిన్ అంటూ మంత్రి వివరణ ఇచ్చుకున్నారు.
తొలిసారి ఎమ్మెల్యే అయిన శరత్‌కుమార్‌కు టీవీకే ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కింది. ఇప్పుడు ఆయనపై డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. మొబైల్ ఫోన్ స్కీన్‌పై ఒక తెల్లని పదార్థాన్ని ఉంచి, ఏటీఎం కార్డుతో పొడి చేస్తున్నట్లుగా ఆ దృశ్యాల్లో కనిపించింది. ఆయన అప్పుడు ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారు. పక్కనే రూ.500 నోటు కూడా ఉంది. తన సన్నిహితులకు మాత్రమే కనిపించేలా ‘థగ్ లైఫ్’ పేరుతో కొన్ని సంవత్సరాల క్రితం ఇన్‌స్టా స్టోరీలో దానిని షేర్ చేశారు. ‘స్టార్ట్ రన్, స్టాప్ డ్రగ్’ పేరిట మత్తుపదార్థాలకు వ్యతిరేకంగా నిర్వహించిన మారథాన్‌లో సీఎం విజయ్ (Vijay) పాల్గొన్న రోజే ఈ వీడియో వెలుగులోకి రావడం గమనార్హం.
దీంతో మంత్రి డ్రగ్స్ వాడారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన రాజీనామా చేయాలంటూ పలువురు డిమాండ్ చేశారు. దీంతో శరత్ కుమార్ స్పందించారు. తన భార్య, చిన్న కుమార్తెతో కలిసి ఉన్న ఒక వీడియోను షేర్ చేసి, వివరణ ఇచ్చుకున్నారు. ‘‘చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రెండేళ్ల క్రితం ఐపీఎల్ మ్యాచ్‌కు హాజరయ్యాను. నా కుటుంబం, స్నేహితులతో కలిసి మ్యాచ్‌కు వెళ్లాను. అప్పుడు నా కుమార్తె వయసు ఏడాదిన్నర. ఆరోజు మా పాప కాస్త అనారోగ్యంగా ఉండటంతో.. లిక్విడ్‌లో కలిపి ఇచ్చేందుకు ట్యాబ్లెట్‌ను పౌడర్ చేశాను. డాక్టర్ సలహా మేరకే మేం అలా చేశాం. దురుద్దేశంతో అప్పటి వీడియోను వైరల్ చేస్తున్నారు’’ అని పేర్కొన్నారు.
‘‘ముఖ్యమంత్రి విజయ్ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ముందుకువెళ్తున్నారు. ఇప్పుడు తన మంత్రిపై వ్యక్తమవుతోన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఆయనపై లేదా..? ప్రజల్లో అనుమానాలను అలాగే వదిలేయకూడదు’’ అని డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై ఎక్స్ వేదికగా వ్యాఖ్యలు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.