ఆయన డీజీపీస్థాయి అధికారి.. మరో మూడు రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తన మూలాలను, గురువులను మరచిపోలేదు.
తన పదవీ విరమణ వేళ విద్యాబుద్ధులు నేర్పిన గురువుల్ని గుర్తుచేసుకుని.. తనను ఈ స్థాయికి ఎదిగేలా చేసినందుకు గురుభక్తి చాటుకున్నారు. గురువుల్ని ఘనంగా సత్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. మాదిరెడ్డి ప్రతాప్.. ఆంధ్రప్రదేశ్ రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌గా అదనపు డీజీపీ కేడర్ అధికారిగా ఉన్నారు.. ఆయన ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా తన సొంత ఊరికి గురువుల ఆశీస్సుల కోసం వెళ్లారు. నరసరావుపేటకు చెందిన మాదిరెడ్డి ప్రతాప్ 1982లో స్థానికంగా ఉన్న ఎస్‌కేఆర్‌బీఆర్ స్కూల్లో 1వ తరగతి నుంచి పదోతరగతి వరకు చదివారు. అనంతరం ఉన్నత చదువులు చదివి ఐపీఎస్ అయ్యారు.. ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో ప్రస్తుతం అడిషనల్ డీజీపీ కేడర్ రహదారి భద్రత విభాగం ఛైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఈనెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా నరసరావుపేట వెళ్లిన మాదిరెడ్డి ప్రతాప్ తన గురుభక్తిని చాటుకున్నారు.. జీవితంలో ఇంత ఉన్నతస్థాయికి ఎదగడానికి కారణమైన తన గురువుల్ని సత్కరించారు. యూనిఫామ్‌లోనే వెళ్లి తన గురువుల ఆశీస్సులు తీసుకున్నారు. గురువులతో ఆప్యాయంగా మాట్లాడి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నరసరావుపేటలోని ఎస్‌కేఆర్‌బీఆర్ స్కూల్లో చదివానని.. అక్కడ తనకు బోధించిన గురువులే జీవితంలో తన ఎదుగుదలకు పునాది వేశారన్నారు మాదిరెడ్డి ప్రతాప్. తన తల్లిదండ్రులు, గురువుల కారణంగానే తాను ఈ స్థాయిలో ఉన్నానన్నారు. త్వరలో పదవీ విరమణ చేయబోతున్నానని.. తనను తీర్చిదిద్దిన గురువులను స్వయంగా కలిసి సన్మానించి వారి ఆశీర్వాదం తీసుకోవాలనే సంకల్పంతో సొంత ఊరికి వచ్చానన్నారు. మాదిరెడ్డి ప్రతాప్ తన చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. తాను నరసరావుపేటలోనే పుట్టి పెరిగానని.. ఈ ప్రాంతంతో తనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను కష్టపడి చదువుకుని ఐపీఎస్ అధికారిగా ఎదిగానన్నారు. తన తండ్రి వ్యవసాయం చేసేవారని, తన తల్లి పాలు విక్రయిస్తూ తనను ఇంతటి వాడిని చేశారని ఎమోషనల్ అయ్యారు. తన తల్లి ఇంటింటికి తిరిగి పాలు పోసేవారని.. చిన్నతనంలో తాను కూడా అమ్మతో కలిసి ఇంటింటికి వెళ్లి పాలు పోసేవాడినన్నారు. తనకు ఉద్యోగ జీవితం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు.. తన బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఉమేష్‌చంద్ర మరణం తనను బాధించిందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో తాను కీలక బాధ్యతలు నిర్వహించానన్నారు. శ్రీసిటీ సెజ్ ఏర్పాటు సమయంలో తాను కీలక పాత్ర పోషించానని.. హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమకు చంద్రబాబు ఆద్యుడన్నారు. అమరావతికి రైతులు ఉచితంగా భూములు ఇవ్వడం గొప్ప విషయమన్నారు.. వారి త్యాగానికి, ఔదార్యానికి విలువ కట్టలేమన్నారు. మాదిరెడ్డి ప్రతాప్‌ను స్నేహితులు, స్థానికులు ఘనంగా సత్కరించారు.