Venezuela Earthquake| ఇంటర్నెట్‌డెస్క్: జంట భూకంపాలతో వణికిన వెనెజువెలాలో మరోసారి భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.9గా నమోదైంది.
ఆ దేశ కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రకంపనలు వచ్చాయి. రాజధాని నగరం కారకస్, మరాకే సమీపంలో ఈ ప్రభావం కనిపించడంతో ప్రజలు వణికిపోయారు. మరోవైపు, ఇటీవల సంభవించిన భారీ భూకంపాల కారణంగా ఆ దేశానికి రూ.63వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా.
బుధవారం సాయంత్రం 7.2, 7.5 తీవ్రతతో క్షణాల వ్యవధిలో రెండు భూకంపాలు (Venezuela Earthquakes) రావడంతో వేలాదిమంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వందల భవనాలు కూలిపోవడంతో సహాయకచర్యలు క్లిష్టంగా మారాయి. రెస్క్యూ సిబ్బంది సంఖ్య పరిమితంగా ఉండటంతో.. ఆత్మీయులను కోల్పోయిన వారంతా చేతులతోనే శిథిలాలను తొలగిస్తున్నారు. ప్రాణాలతో రక్షించడానికి తొలి 48 నుంచి 72 గంటలు కీలకం కావడంతో ఎలాగైనా తమవారిని కాపాడుకోవాలని వారు చేస్తోన్న ప్రయత్నాలతో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఉద్విగ్న వాతావరణం కనిపిస్తోంది.
లా గువేరా రాష్ట్రం జంట భూకంపాలతో తీవ్రంగా ప్రభావితమైంది. రెస్క్యూ సిబ్బంది ఈ రాష్ట్రంలో పలు ప్రాంతాలకు చేరుకోవడంలో ఆలస్యమవుతుండటంతో బాధితుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎనిమిది అంతస్తుల భవనం కూలడంతో తన ఐదేళ్ల కుమారుడు, మరికొంతమంది బంధువులు చిక్కుకుపోయారని జెన్నిఫర్ అనే మహిళ వాపోయారు. ప్రభుత్వ సహాయం ఆలస్యమవుతుండటంతో స్థానికులే చాలామందిని రక్షించారని, అయితే భారీ కాంక్రీటు స్లాబులు ఎత్తడానికి క్రేన్లు, భారీ యంత్రాల అవసరం ఉందన్నారు.
ఈ ప్రకృతి విపత్తుతో వెనెజువెలాకు ప్రత్యక్షంగా 6.7 బిలియన్ డాలర్ల (రూ.63వేల కోట్ల) మేర నష్టం వాటిల్లిందని ఐరాస అంచనా వేసింది. పరోక్ష ప్రభావాన్నీ లెక్కిస్తే ఇంకా ఎక్కువే ఉండొచ్చని అభిప్రాయపడింది. దీంతో ఆ దేశంలో సంభవించిన అత్యంత ఘోరమైన విపత్తుల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే రాజకీయ అస్థిరత, ఆర్థిక సమస్యల కారణంగా వ్యవస్థలు బలహీనపడ్డాయి. ఇప్పుడు విపత్తు కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులైనప్పటికీ.. వారికి ఆశ్రయం కల్పించలేని పరిస్థితి నెలకొంది. భూకంపాల తీవ్రత వల్ల ఇళ్లలోకి వెళ్లలేనివారు కార్లలోని నిద్రపోతున్నారు. పార్కుల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దాదాపు మూడుకోట్ల జనాభా కలిగిన ఆ దేశంలో సగంమందిపైగా పేదరికంలోనే మగ్గిపోతున్నారు. భూకంపాలు రాకముందే 80 లక్షల మంది మానవతా సహాయం అవసరమైన పరిస్థితులున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.