
టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌కు టీ20 కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. పసికూన ఐర్లాండ్ చేతిలో అతని సారథ్యంలోని భారత జట్టు అనూహ్య రీతిలో ఓడిపోయింది.
స్పోర్ట్స్ డెస్క్: 2026 టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్ అయిన భారత జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. అలానే టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు తొలి మ్యాచ్‌లోనే ఓటమి చవిచూశాడు. పసికూన ఐర్లాండ్ చేతిలో భారత జట్టు అనూహ్య రీతిలో ఓడిపోయింది. బెల్ఫాస్ట్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ సేన 34 పరుగుల తేడాతో ఐర్లాండ్ చేతిలో పరాజయం పాలైంది. మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ఓడినప్పటికీ కెప్టెన్‌గా ఇది ఒక గొప్ప ఆరంభమని వ్యాఖ్యానించాడు.
శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ..' మ్యాచ్ ప్రారంభంలో మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారని నేను అనుకుంటున్నాను. వారు లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేశారు. అలాగే రెండు వికెట్లు కూడా తీశారు. దాంతో మాకు అద్భుతమైన ఆరంభం లభించింది. కానీ మధ్యలో మేము ఆటపై పట్టు వదిలేసినట్లు అనిపించింది. మా ఇన్నింగ్స్ ఆరంభం కూడా చాలా చక్కగా ప్రారంభమైంది. కానీ మధ్యలో వరుస వికెట్లు పడటంతో మ్యాచ్‌పై పట్టుకోల్పోయాము' అని తెలిపాడు.
'ఏదీ సులువుగా దొరకదు. కఠినంగా శ్రమిస్తేనే విజయం వరిస్తుంది. గతంలో ఏం జరిగిందన్న విషయంతో సంబంధం లేకుండా.. వర్తమానంలో జీవించడం ముఖ్యం. ప్రత్యర్థిని కట్టడి చేసే అవకాశం లభిస్తే.. ఎట్టిపరిస్థితుల్లోనూ చేజారనీయకూడదు. ఇక్కడ వాళ్లు 140 పరుగులు చేయడం గొప్పే అనిపించింది. కానీ వారిని మేము కట్టడి చేయలేకపోయాము. ఇలాంటి పిచ్‌లపై మరిన్ని మ్యాచ్‌లు ఆడాలి. అప్పుడే వికెట్‌పై మాకు ఓ అవగాహన వస్తుంది. ఏదేమైనా కెప్టెన్‌గా నాకిది గొప్ప ఆరంభమే’ అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు.