ఒకరికి తెలియకుండా మరొకరు...అమ్మాయిల్ని వరుసగా పెళ్లిళ్లు చేసుకుని మోసం చేస్తున్న నిత్య పెళ్లికొడుకుల గురించి వినుంటాం. ఈమె మాత్రం అలా కాదండోయ్ ఒకరికి తెలియకుండ మరొకరు..
ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకుని నిత్యపెళ్లికూతురిలా మారింది. అనంతపురం జిల్లాకు చెందిన ఓ బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి ఆమెను అరెస్ట్ చేయడంతో ఐదు పెళ్లిళ్ల వ్యవహారం బయటపడింది. ఆమె గురించి ఆరా తీస్తే విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడికి చెందిన వజ్రపు మణి అలియాస్ శ్వేతారెడ్డి అలియాస్ కీర్తి నిత్య పెళ్లికూతురు అవతారమెత్తింది. మణి విజయవాడకు చెందిన మధ్యవర్తులు సుమప్రియ, అశోక్, రామకృష్ణ,శశికళ ద్వారా పెళ్లి సంబంధాలు చూసుకునేది. ఈ క్రమంలో మణి 2025లో అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాశేపల్లికి చెందిన సుధీర్‌రెడ్డికి మధ్యవర్తుల ద్వారా పరిచయమైంది. అదే ఏడాది సుధీర్ రెడ్డి ఆమెకు రూ.3.8 లక్షలు ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి సంబంధం కుదిర్చిన మధ్యవర్తులు మణికి రూ.20-30 వేలే ఇచ్చేవారు. సుధీర్‌రెడ్డితో వివాహమైన తర్వాత మూడు రోజుల పాటూ అతడి ఇంట్లోనే ఉంది. మూడు రోజుల తర్వాత సుధీర్ రెడ్డితో దాంపత్య జీవితం ప్రారంభించకుండానే అసలు డ్రామా మొదలైంది. తనకు ఆరోగ్యం సరిగా లేదని.. వెంటనే పుట్టింటికి వెళతానని చెప్పింది. సుధీర్ రెడ్డి ఆమెను వెంట బెట్టుకుని రైలులో బయలుదేరారు.. మధ్యలో నంద్యాల దగ్గర రైలు ఆగగానే ఆమె దిగి పారిపోయింది. ఆమె కోసం సుధీర్ రెడ్డి రైల్వే స్టేషన్లో గాలించినా ఆచూకీ దొరకలేదు. అప్పుడు సుధీర్ రెడ్డి తాను మోసపోయినట్లు గుర్తించారు. వెంటనే తనకు పెళ్లి సంబంధం చూసిన మధ్యవర్తులకు కాల్ చేయగా.. ఫోన్ స్విచ్చాఫ్ అని వచ్చింది. అప్పుడు సుధీర్ రెడ్డి మణి గురించి ఆరా తీయడం మొదలుపెడితే అసలు సంగతి తెలిసింది.మణి ఐదుగురిని పెళ్లిచేసుకొని మోసం చేసినట్టు సుధీర్ రెడ్డికి తెలిసింది. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారని తెలియడంతో అవాక్కయ్యాడు. వెంటనే అతడు పెద్దవడుగూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా 2025 నుంచి ఆమె కోసం గాలిస్తున్నారు. తాజాగా మణి కర్ణాకకు మకాం మార్చింది.. అక్కడ మల్లెకుప్పకు చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తేలింది. ఆమె కర్ణాటకలోని మల్లెకుప్ప నుంచి మదనపల్లెకు వస్తున్నట్లు పెద్దవడుగూరు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి.. మధ్యవర్తులపై కేసు నమోదు చేశారు. త్వరలోనే మధ్యవర్తుల్ని కూడా అరెస్ట్ చేస్తామని పెద్దవడుగూరు పోలీసులు చెబుతున్నారు. మొత్తం మీద పోలీసులు నిత్య పెళ్లికూతురి ఆటకట్టించారు.