
వెనెజువెలాను వణికించిన జంట భూకంపాల విధ్వంసం రోజురోజుకూ భయానకంగా మారుతోంది. నాలుగు రోజులు గడిచినా శిథిలాల కింద చిక్కుకున్న వేలాది మంది కోసం సహాయక బృందాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయి.
Jun 27 2026 8:00 AM | Updated on Jun 27 2026 8:04 AM
వెనెజువెలాను వణికించిన జంట భూకంపాల విధ్వంసం రోజురోజుకూ భయానకంగా మారుతోంది. నాలుగు రోజులు గడిచినా శిథిలాల కింద చిక్కుకున్న వేలాది మంది కోసం సహాయక బృందాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో వరుస ఆఫ్టర్‌షాక్‌లు(వరుస ప్రకంపనలు.. తాజాగా 4.9 తీవ్రత) నమోదవుతుండటంతో బాధితుల్లో భయం మరింత పెరుగుతోంది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 920కి చేరగా, మరో 50 వేల మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని నివేదికలు చెబుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
బుధవారం సాయంత్రం కేవలం ఒక్క నిమిషం వ్యవధిలో.. రిక్టర్‌స్కేల్‌పై 7.2, 7.5 తీవ్రతతో సంభవించిన రెండు భారీ భూకంపాలు ఉత్తర వెనెజువెలాను అతలాకుతలం చేశాయి. రాజధాని కారకాస్ సమీపంలోని తీరప్రాంత నగరం లా గ్వైరా అత్యంత తీవ్రంగా దెబ్బతింది. భారీ అపార్ట్మెంట్లు, వాణిజ్య భవనాలు క్షణాల్లో నేలమట్టమయ్యాయి. అనేక ప్రాంతాల్లో శిథిలాల కిందే వందలాది మంది చిక్కుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు.
సహాయక చర్యలు మాత్రం ఆశించిన వేగంతో సాగడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలాచోట్ల భారీ యంత్రాలు లేకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు, వాలంటీర్లే చేతులతో శిథిలాలను తొలగిస్తూ తమ ఆత్మీయుల కోసం వెతుకుతున్నారు. ఐదు నెలల చిన్నారి గల్లంతైందంటూ ఓ తల్లి కన్నీరుమున్నీరవుతుండగా, ప్రభుత్వ సహాయం కనిపించడం లేదంటూ మరో బాధితురాలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అధికారికంగా.. ఇప్పటివరకు 920 మంది మృతి చెందగా, 3,360 మందికి పైగా గాయపడ్డారు. అయితే మరో 50 వేల మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని లోకల్ మీడియా కథనాలు, పలు నివేదికల ఆధారంగా ఐక్యరాజ్యసమితి చెప్తున్నాయి. శిథిలాల కింద ఇంకా 172 మంది చిక్కుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే.. గణాంకాల విషయంలో ప్రభుత్వం దాపరికం ప్రదర్శిస్తుండడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
ప్రజల ఆగ్రహం తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్పై కూడా వ్యక్తమైంది. ఆమె బాధిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు స్థానికులు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. పరిస్థితుల దృష్ట్యా విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో రాత్రి 8 గంటల తర్వాత ప్రవేశాన్ని అధికారులు తాత్కాలికంగా నిషేధించారు. అదే సమయంలో.. పాజిటివ్ వీడియోలను ప్రభుత్వం వైరల్ చేస్తోంది. సహాయక చర్యల్లో చిన్నారులను, వృద్ధులను, మూగజీవాలను రక్షించిన వీడియోలను రిలీజ్ చేస్తోంది. అయినప్పటికీ.. ప్రజాగ్రహం మాత్రం చల్లారడం లేదు.
ఇదిలా ఉండగా.. ప్రపంచ దేశాలు వెనెజువెలాకు అండగా నిలుస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కనీసం 17 దేశాల నుంచి ప్రత్యేక రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. చిలీ, స్పెయిన్, స్విట్జర్లాండ్, మెక్సికో, కొలంబియా, ఎల్ సాల్వడార్ దేశాల బృందాలు ఇప్పటికే సహాయక చర్యల్లో పాల్గొంటుండగా.. అమెరికా కూడా 250 మందికిపైగా సిబ్బంది, ప్రత్యేక శునకాలతో కూడిన సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలను పంపేందుకు సిద్ధమైంది.
ఈ భూకంపాల్లో పలువురు విదేశీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటిదాకా తొమ్మిది మంది పోర్చుగల్ పౌరులు, ఐదుగురు స్పెయిన్ పౌరులు, ఇద్దరు బ్రెజిలియన్లు, ఇద్దరు చైనా పౌరులు, ఒక ఇటలీ-వెనెజువెలా పౌరుడు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు వందలమంది విదేశీయుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.
దశాబ్దకాలంగా ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న వెనెజువెలాలో.. ఆస్పత్రులు, ప్రభుత్వ సేవలు ఇప్పటికే బలహీనంగా ఉండటంతో సహాయక చర్యలు మరింత క్లిష్టంగా మారాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. భూకంపం తర్వాత 50 నుంచి 60 వేల మంది జాడ లేకపోయారని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో మృతుల సంఖ్య భారీగానే ఉండొచ్చని అంచనా వేస్తోంది. ఈ అత్యవసర పరిస్థితి మరింత పెద్ద మానవ విపత్తుగా మారకుండా అంతర్జాతీయ సమాజం తక్షణమే మరింత సహాయం అందించాలని పిలుపునిచ్చింది.
వెనెజువెలా భూకంపంలో మృతులు, క్షతగాత్రులకు గౌరవసూచకంగా ఫిఫా ప్రపంచకప్-2026 ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు ముందు రెండు నిమిషాల మౌనం పాటించారు. దాదాపు వందేళ్ల తర్వాత వెనెజువెలాలో సంభవించిన అత్యంత తీవ్ర భూకంపాలు ఇవేనని భూకంప నిపుణులు చెబుతున్నారు.
నెల్లూరు : ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం (ఫొటోలు)
గ్రాండ్‌గా నటి ఖుష్బూ కూతురి పెళ్లి (ఫొటోలు)
మృణాల్.. అందగత్తెలకే అసూయ పుట్టించేస్తూ (ఫొటోలు)
హస్తికలు వెలికితీయండి... సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుపై NHRC ఆగ్రహం
కర్త, కర్మ, క్రియ CP రాజశేఖర్ బాబే...! హైకోర్టు న్యాయమూర్తికి నా విన్నపం ఇదే
Big Update: సాయి కృష్ణ శవం మాయం చేసింది.. హెడ్ కానిస్టేబుల్ అశోక్
మళ్లీ యుద్ధం.. ఇరాన్ పై భారీ స్థాయిలో దాడులు చేసిన అమెరికా
100 మంది ఉన్న పోలీసు స్టేషన్ లో సాయి కృష్ణను చంపడం ఒక్కరు కూడా చూడరా?