
మన రోజూవారీ జీవితంలో ఎన్నో మంచి సంఘటనలు జరిగినా, రాత్రి పడుకునే సమయానికి మాత్రం విమర్శ, అవమానం లేదా ఒక చిన్న తప్పే మనసులో పదే పదే తిరుగుతూ ఉంటుంది. పది మంది మనల్ని మెచ్చుకున్నా సరే..
ఒక్కరు చేసిన ప్రతికూల వ్యాఖ్యే ఎక్కువగా గుర్తుండిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? మన మెదడు సహజంగానే అలా పనిచేస్తుందా? సైకాలజీ నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.
సైకాలజీ నిపుణుల ప్రకారం మన మెదడు ప్రమాదకరమైన లేదా బాధ కలిగించే సంఘటనలను ఎక్కువగా గుర్తుంచుకునేలా అభివృద్ధి చెందింది. విమర్శలు, అపజయాలు, ఉద్యోగ ఒత్తిడి, సంబంధాల్లో తలెత్తే సమస్యలు వంటి ప్రతికూల అనుభవాలను కూడా మన మెదడు అదే తీవ్రతతో గుర్తుంచుకుంటుంది. న్యూరోసైన్స్ పరిశోధనల ప్రకారం భావోద్వేగాలకు సంబంధించిన సమాచారాన్ని మెదడులోని కొన్ని భాగాలు ప్రత్యేకంగా ప్రాసెస్ చేస్తాయి. ముఖ్యంగా భయం, ప్రమాదం లేదా ఒత్తిడికి సంబంధించిన అనుభవాలు ఎక్కువ భావోద్వేగ తీవ్రతను కలిగిస్తే, అవి జ్ఞాపకాల్లో బలంగా నిలిచే అవకాశం ఉంటుంది.
నెగెటివ్ విషయాలు ఎక్కువగా గుర్తుండటం అంటే మన మానసిక ఆరోగ్యం బాగోలేదని అర్థం కాదు. ఇది సాధారణ మానసిక ప్రక్రియ. కానీ ప్రతికూల ఆలోచనలు రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసేంతగా పెరిగితే లేదా పని, నిద్ర, సంబంధాలు లేదా ఆనందాన్ని దెబ్బతీస్తే మాత్రం నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ప్రతి ఒక్కరికీ అప్పుడప్పుడు నెగెటివ్ ఆలోచనలు రావడం సహజమే. కానీ వాటి తీవ్రత, ప్రభావం ముఖ్యం.
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వినియోగం కూడా ఈ ధోరణిపై ప్రభావం చూపవచ్చు. ప్రతికూల వార్తలు, విమర్శలు లేదా ఇతరులతో నిరంతర పోలికలు మన దృష్టిని మరింత నెగెటివ్ వైపు మళ్లించవచ్చు. అందుకే డిజిటల్ వినియోగానికి పరిమితులు పెట్టుకోవడం, విశ్వసనీయ సమాచారం మాత్రమే చదవడం, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో ప్రత్యక్షంగా సమయం గడపడం వంటి అలవాట్లు మానసిక సమతుల్యతకు దోహదపడతాయని నిపుణులు సూచిస్తున్నారు.
సైకాలజీ నిపుణుల ప్రకారం, నెగెటివ్ విషయాల నుంచి బయటపడాలంటే.. రోజులో జరిగిన మూడు మంచి విషయాలను రాసుకోవడం, కృతజ్ఞత భావాన్ని పెంపొందించడం మంచిది. అలాగే ధ్యానం లేదా మైండ్ఫుల్నెస్ సాధన చేయడం, తగినంత నిద్రపోవడం, శారీరక వ్యాయామం చేయడం వంటి అలవాట్లు మెదడుపై సానుకూల ప్రభావం చూపుతాయి. అంతేకాదు ప్రతి నెగెటివ్ ఆలోచన నిజమేనా, దానికి ఆధారాలు ఏంటి అని ప్రశ్నించుకోవడం కూడా మంచి పద్ధతి.