భారత సైన్యంలో కీలకమైన సదరన్ కమాండ్‌కు కొత్త బాస్ వచ్చారు. లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ ను సదరన్ కమాండ్ కొత్త జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా భారత సైన్యం నియమించింది.
పుణే కేంద్రంగా పనిచేసే సదరన్ కమాండ్ బాధ్యతలను లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ జూలై 1వ తేదీ స్వీకరించనున్నారు. ఆయన ప్రస్తుతం అంబాలా కేంద్రంగా ఉన్న ఖార్గా కార్ప్స్ IIకు కమాండర్‌గా సేవలు అందిస్తున్నారు. భారత సైన్యంలో అత్యంత శక్తివంతమైన స్ట్రైక్ కార్ప్స్లో ఒకటైన సదరన్ కమాండ్.. పశ్చిమ సరిహద్దులో ఆర్మీ సామర్థ్యానికి కీలక బలంగా నిలుస్తోంది. స్ట్రైక్ కార్ప్స్కు నాయకత్వం వహించిన ఆయన ఇప్పుడు ఆర్మీ కమాండ్‌కు అధిపతిగా పదోన్నతి పొందడం ఆయనకు కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌కు బావమరిది కావడం గమనార్హం. దీనిపై స్పందించిన శశిథరూర్ సంతోషం వ్యక్తం చేశారు. పుణే ప్రధాన కేంద్రంగా పనిచేసే సదరన్ కమాండ్.. భారత సైన్యంలో అత్యంత పురాతన, అతిపెద్ద కమాండ్లలో ఒకటి. పశ్చిమ, మధ్య, దక్షిణ భారతదేశంతో పాటు ద్వీపకల్ప ప్రాంతాలు, తీరప్రాంతాల భద్రత, సైనిక సన్నద్ధతకు ఈ సదరన్ కమాండ్ బాధ్యత వహిస్తుంది. ఈ సదన్ కమాండ్ పరిధిలో జోధ్‌పూర్‌లోని కోణార్క్ కార్ప్స్.. భోపాల్‌లోని సుదర్శన్ చక్ర కార్ప్స్, పలు ట్రైనింగ్ సెంటర్లు, లాజిస్టిక్స్ యూనిట్లు, పరిపాలనా విభాగాలు ఉన్నాయి. సాధారణ సైనిక భద్రతతో పాటు తీర ప్రాంత రక్షణ, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యలు వంటి కీలక బాధ్యతలను కూడా ఈ సదరన్ కమాండ్ నిర్వహిస్తుంది.ఆర్మర్డ్ కార్ప్స్కు చెందిన లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్‌కు.. సైన్యంలో 35 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) పూర్వ విద్యార్థి కావడం విశేషం. అలాగే సికింద్రాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్.. న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీలో ఉన్నత సైనిక విద్యను అభ్యసించారు. ఆర్మర్డ్ రెజిమెంట్‌కు కమాండ్ చేయడంతో పాటు.. స్వతంత్ర ఆర్మర్డ్ బ్రిగేడ్, పశ్చిమ సెక్టార్లో ఇన్ఫెంట్రీ డివిజన్‌కు కూడా నాయకత్వం వహించారు. 2024 జూలై 1వ తేదీన ఖార్గా కార్ప్స్ కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్.. రక్షణ మంత్రిత్వ శాఖ ఇంటిగ్రేటెడ్ ఆఫీసులో డైరెక్టర్ జనరల్ ఆఫ్ టెరిటోరియల్ ఆర్మీగా పనిచేశారు. నేషనల్ ఎమర్జెన్సీ పరిస్థితులు, ఆపరేషన్ల సమయంలో రెగ్యులర్ ఆర్మీకి సహకరించే టెరిటోరియల్ ఆర్మీ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ఇక రాజేష్ పుష్కర్ విదేశీ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. భూటాన్‌లో భారత సైనిక ట్రైనింగ్ సెంటర్లో సేవలు అందించారు. అలాగే రష్యాలోని భారత రాయబార కార్యాలయంలో డిఫెన్స్ అండ్ మిలిటరీ అటాచేగా పనిచేశారు. ఆర్మేనియా, బెలారస్ దేశాలకు కూడా ఆయనకు అదనపు బాధ్యతలు ఉండటంతో సైనిక దౌత్యరంగంలో విలువైన అనుభవం సంపాదించారు.రాజేష్ పుష్కర్ ఖార్గా కార్ప్స్ కమాండర్‌గా ఉన్న సమయంలో యుద్ధ సన్నద్ధతతో పాటు అత్యాధునిక టెక్నాలజీ వినియోగంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. డ్రోన్లు, యాంటీ డ్రోన్ వ్యవస్థలు, ప్రెసిషన్ ఆయుధాలు, అధునాతన నిఘా వ్యవస్థలు, సురక్షిత కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను ఆపరేషన్లలో సమర్థంగా వినియోగించేలా చర్యలు చేపట్టారు. భవిష్యత్‌లో యుద్ధ స్వరూపం మారుతోందని.. సైనికాధికారులు సాంకేతిక ఆధారిత, బహుముఖ యుద్ధ వాతావరణానికి సిద్ధంగా ఉండాలని ఆయన పలుమార్లు సూచించారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ బావమరిది కావడం గమనార్హం. లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ నియామకంపై హర్షం వ్యక్తం చేస్తూ.. సైన్యంలో చూపించిన ప్రతిభ, క్రమశిక్షణ, దేశసేవ పట్ల అంకితభావాన్ని కొనియాడుతూ శశిథరూర్ అభినందనలు తెలిపారు. భారత సైన్యంలో ఆరు ఆపరేషనల్ కమాండ్లు ఉండగా.. అందులో సదరన్ కమాండ్ అన్నింటికంటే పెద్దదని పేర్కొ్న్నారు. దేశానికి సేవ చేయడానికి ఆయన స్వీకరిస్తున్న కొత్త బాధ్యతల సందర్భంగా శుభాకాంక్షలు చెబుతున్నట్లు శశిథరూర్ తెలిపారు.