
Rahul Gandhi | దిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై భారతీయ జనతా పార్టీ మరోసారి విమర్శలు గుప్పించింది.
లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన తన హోదాను ‘లీడర్ ఆఫ్ పర్యాటన్’ (LoP)గా మార్చుకోవాలని ఎద్దేవా చేసింది. ప్రముఖ బాలీవుడ్ చిత్రాలను అనుకరిస్తూ రాహుల్ ఫొటోలతో రూపొందించిన పోస్టర్లను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ‘చక్‌దే ఇండియా’ అనే పేరు ధ్వనించేలా ‘చాడ్ దే ఇండియా’ (భారత్ వీడి వెళ్లిపోవాలి); భారత్‌లో రాహుల్ కనిపించడం లేదు అని అర్థం వచ్చేలా ‘లాపతా రాహుల్’ అంటూ రాష్ట్ర భాజపా విభాగాలు వ్యంగ్య పోస్టులను షేర్ చేశాయి. ‘రాహుల్ బాబాకు స్వదేశం కంటే విదేశాలే ఇష్టం’ అంటూ భాజపా దిల్లీ యూనిట్ పోస్ట్ చేయగా.. ‘రాహుల్ ఎక్కడున్నావ్.. థాయ్‌లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్నావా..?’ అంటూ గోవా విభాగం ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టింది.
‘నాకున్న సమాచారం ప్రకారం రాహుల్ గాంధీ 55 విదేశీ పర్యటనలు చేశారు. దాదాపు రూ.60 కోట్లు ఖర్చు చేశారు. ఆయనకు ఇంత డబ్బు ఎక్కడ నుంచి వస్తోంది. ఇంత ఆదాయం ఉందని ఆయన ఎక్కడా చెప్పలేదు. ఆదాయ పన్ను కూడా కట్టడం లేదు. మరి ఆ సొమ్ము ఎక్కడిది?’ అంటూ భాజపా అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ పర్యాటన్గా తన పేరు మార్చుకోవాలని మరో అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఎద్దేవా చేశారు.
భాజపా విమర్శలకు కాంగ్రెస్ పార్టీ కూడా ధీటుగా బదులిచ్చింది. రాహుల్ గాంధీని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కలవాలని కోరుకుంటున్నారని, పలు దేశాలు ఆయన్ను ఆహ్వానిస్తున్నాయని ఆ పార్టీ పేర్కొంది. అయినప్పటికీ వారిలో కొద్దిమందికే రాహుల్ సమయం కేటాయిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. రాహుల్ గాంధీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకుడని కాంగ్రెస్ ఎంపీ మనోజ్ కుమార్ అన్నారు. మోదీ విదేశీ పర్యటనలు చేసినప్పుడు లేనిది.. రాహుల్ చేస్తే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
పశ్చిమబెంగాల్లోని జల్పాయ్గుడీ ప్రాంతంలో ఏనుగుల గుంపు సందడి చేసింది.