
ఇంటర్నెట్ డెస్క్: ఎన్సీఈఆర్టీ కొత్తగా రూపొందించిన 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకం (NCERT textbook)లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ను చేర్చారు.
అర్హులైన పౌరులను ఓటర్ల జాబితా నుంచి విస్మరించకుండా.. అనర్హులెవరూ ఈ జాబితాలో చేరకుండా చూసే ప్రక్రియగా దీనిని పుస్తకంలో వివరించారు. ఈ ప్రక్రియ ద్వారా ఓటర్లందరినీ, ముఖ్యంగా అవగాహన లేకపోవడం వల్ల ఓటరుగా నమోదు చేసుకోని లక్షలాది మంది 18ఏళ్లు నిండిన యువ ఓటర్లను జాబితాలో చేర్చినట్లు ‘అండర్స్టాండింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్’ అనే పాఠ్యపుస్తకంలోని ఓ విభాగంలో పేర్కొన్నారు.
ఓటరు మరణం, నివాస మార్పు, నకిలీ నమోదు, శాశ్వతంగా ఆచూకీ తెలియకపోవడం వంటి వాటి ఆధారంగా కూడా SIR పేర్లను తొలగిస్తుందని ఎన్సీఈఆర్టీ (NCERT) తన పాఠ్యాంశాలో పేర్కొంది. నకిలీ వార్తలు, తప్పుడు సమాచారం, బెదిరింపులు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించినందుకు భారత ఎన్నికల సంఘాన్ని (ECI) ప్రశంసించింది. ‘స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలకు సవాళ్లు’ అనే శీర్షికతో దేశంలోని విభిన్న ప్రాంతాల్లో విస్తరించి ఉన్న వేలాది పోలింగ్ కేంద్రాలు, వందలాది రాజకీయ పార్టీలతో 96.8కోట్ల మంది ఓటర్లకు ఎన్నికలు నిర్వహించడం ఓ సవాలుతో కూడుకున్న పని అని పేర్కొంది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను అమల్లోకి తీసుకువచ్చి.. నేటితో ఏడాది పూర్తయింది. మొదటిసారిగా బిహార్ ఎన్నికలకు ముందు పైలట్ ప్రాజెక్ట్‌గా సర్‌ను ఆ రాష్ట్రంలో ప్రారంభించారు. బిహార్‌లో దాదాపు 65 లక్షల నకిలీ పేర్లను తొలగించి.. ఈసీ ఓటర్ల జాబితాను రూపొందించింది. అనంతరం యూపీ, బెంగాల్, గుజరాత్, తమిళనాడు, కేరళ సహా 9రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ పూర్తయింది. తన విధుల్లో భాగంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల నుంచి దాదాపు 6కోట్ల నకిలీ ఓటర్లను తొలగించింది. మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.