గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో కొంత మంది జవాన్లు వీరమరణం పొందారు. తొలిసారిగా ఆ అమర జవాన్ల వివరాలను కేంద్రం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
అమరులైన జవాన్ల పేర్లను నేషనల్ వార్ మెమోరియల్ అధికారిక వెబ్సైట్లో ఉంచింది. వీరిలో ఐదుగురు ఇండియన్ ఆర్మీకి చెందినవారు కాగా.. ఒకరు వైమానిక దళానికి చెందిన అగ్నివీర్ ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న వార్ మెమోరియల్ వద్ద ప్రత్యేక శిలాఫలకంపై వీరి పేర్లను శాశ్వతంగా చెక్కనున్నారు. అమరులైన జవాన్లలో 10 ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన సుబేదార్ మేజర్ పవన్ కుమార్, జమ్మూ కశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ రెజ్మెంట్ 4వ బెటాలియన్‌కు చెందిన రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్, 5 ఫీల్డ్ రెజిమెంట్ లాన్స్ నాయక్ దినేశ్ కుమార్, 237 ఫీల్డ్ వర్క్‌షాపు హవల్దార్ సునీల్ కుమార్ సింగ్, ఎయిర్‌ఫోర్స్ 39వ వింగ్ సార్జెంట్ సురేంద్ర కుమార్, 851 లైట్ రెజ్మింట్ అగ్నివీర్ మురళీ నాయక్ ఉన్నారు. వీరిలో రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్‌కు మరణానంతరం మూడో అత్యున్నత సైనిక పురస్కారం ‘వీర చక్ర’తోనూ, సార్జెంట్ సురేంద్ర కుమార్‌ను ‘వాయు మెడల్’తో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. అగ్నివీర్ మురళీ నాయక్ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా కళ్లితండాకు చెందినవారు. 2022లో అగ్నివీర్‌గా ఎంపికైన మురళీ నాయక్ ముందు పంజాబ్, అసోంలో విధులు నిర్వర్తించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ ఎదురు కాల్పుల్లో అమరుడయ్యారు. పహల్గాంలో పాకిస్థాన్ ఉగ్రవాదులు పర్యాటకులపై జరిపిన కాల్పుల్లో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా 2025 మే 7వ తేదీ అర్ధరాత్రి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్, పీఓకేలోని జైషే మహమ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన తొమ్మిది శిబిరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. దీంతో ఇరు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు కొనసాగిన ఉద్రిక్తతలు మే 10 కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో తగ్గుముఖం పట్టాయి.ఇక, అమరవీరులకు అంకితం చేసిన జాతీయ యుద్ధ స్మారకం 16 వృత్తాకార గ్రానైట్ గోడలతో ఉంటుంది. స్వాతంత్ర్యం తర్వాత దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన ప్రతి సైనికుడి పేరు, హోదా, యూనిట్ ఈ గోడలపై చెక్కబడి ఉంటాయి. ఆపరేషన్ సింధూర్‌కు చెందిన ఈ ఆరుగురు వీరులు కూడా ఈ స్మారక చిహ్నంలో శాశ్వతంగా ఉండనున్నాయి.