
తొమ్మిది సీజన్లని విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు షో ఈ ఏడాది సీజన్ 10తో ముస్తాబవుతోంది. అప్పుడే సోషల్ మీడియాలో హంగామా మొదలైంది. ఈ సారి షో ఎంత గ్రాండ్ గా ఉండబోతోంది ?
కంటెస్టెంట్స్ గా ఎవరు పాల్గొనే అవకాశం ఉంది ? లాంటి అంశాలపై అప్పుడే ప్రేక్షకులు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో నంద్యాల జిల్లాకి చెందిన ఎస్ఐ నాగార్జున రెడ్డి బిగ్ బాస్ 10 గురించి మాట్లాడుతూ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తనకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో అవకాశం ఇవ్వాలి అని స్వయంగా ఎస్ఐ నాగార్జున రెడ్డి ఈ వీడియోలో రిక్వెస్ట్ చేశారు. నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. బిగ్ బాస్ నిర్వాహకులు, స్టార్ మా యాజమాన్యానికి, తెలుగు ప్రేక్షకులకు నా నమస్కారాలు. నా పేరు నాగార్జున రెడ్డి. కడప జిల్లాకు చెందిన వ్యక్తిని. నంద్యాల జిల్లా గడివేముల పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్నా
బిగ్ బాస్ షోలో కేవలం సెలెబ్రెటీలకు మాత్రమే కాకుండా మారు మూల ప్రజలకు కూడా అవకాశాలు ఇస్తున్నారు. అందుకు బిగ్ బాస్ నిర్వాహకులకు నా అభినందనలు. నాకు ఎంతో ఆత్మవిశ్వాసం ఉంది. ఓర్పు, ధైర్యం, తెలివితేటలు కలిగిన వ్యక్తిని. బిగ్ బాస్ సీజన్ 10 లో నాకు అవకాశం ఇస్తే నా నిజమైన ట్యాలెంట్ ప్రేక్షకులకు చూపిస్తాను.
బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడం, అక్కడ కంటెస్టెంట్ గా రాణించడం చాలా కష్టం. నేను గత సీజన్స్మొత్తం చూశాను. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టేందుకు కావలసిన అర్హతలు అన్నీ నాకు ఉన్నాయి. నాకు బిగ్ బాస్ షోలో అవకాశం ఇస్తే బిగ్ బాస్ నిర్వాహకుల మన్ననలు పొందడంతో పాటు తెలుగు ప్రజల హృదయాలు గెలుచుకుంటా అని నాగార్జున రెడ్డి కాన్ఫిడెంట్ గా చెప్పారు.
మరి ఎస్ఐ నాగార్జున రెడ్డి రిక్వెస్ట్ బిగ్ బాస్ నిర్వాహకుల వరకు చేరుతుందా? అతడికి సీజన్ 10 లో ఛాన్స్ ఇస్తారా ? అనేది వేచి చూడాలి. బిగ్ బాస్ తెలుగు షోకి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.