
అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం కేసులో నిందితులపై ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్ష చూపబోదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.
సనాతన ధర్మం, ప్రజల విశ్వాసంతో చెలగాటం ఆడేవారిపై జీరో టాలరెన్స్ విధానమే అమలు చేస్తామని హెచ్చరించారు.ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదిక అందిన వెంటనే ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని యోగి తెలిపారు. ‘‘అయోధ్య విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని ముందే చెప్పాం. విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం’’ అని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా విపక్షాలపై కూడా యోగి తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ఒకప్పుడు శ్రీరాముడు లేడని చెప్పినవారే ఇప్పుడు భక్తి గురించి మాట్లాడుతున్నారు. రామమందిర నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కోర్టుల్లో పోరాడినవాళ్లే ఇప్పుడు విశ్వాసం గురించి మాట్లాడటం విచిత్రం’’ అని వ్యాఖ్యానించారు.రామమందిర విరాళాల దుర్వినియోగం కేసులో ఇప్పటికే ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలయ విరాళాల నగదు నిర్వహణ, ఉద్యోగుల నియామకాలు, సీసీటీవీ పర్యవేక్షణ, బంగారం, వెండి వంటి కానుకల నిర్వహణలో పలు అవకతవకలు జరిగినట్లు సిట్ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.