Advit Jewels GMP Today: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే వారు ఎక్కువగా ఐపీఓలపైనా ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ మంచి జోరులో ఉండటంతో ఐపీఓలు సందడి చేస్తున్నాయి.
భారత ఐపీఓ మార్కెట్లో 2026లో అసలైన సందడి ఇప్పుడే కనిపిస్తోంది. ఒక జువెల్లరీ కంపెనీ ఐపీఓ దలాల్ స్ట్రీట్‌ను షేక్ చేసేస్తోంది. గత కొంత కాలంగా ఎన్నడూ లేని రీతిలో రికార్డు స్థాయిలో సబ్స్క్రిప్షన్స్ నమోదు చేసింది. అదే అద్విత్ జువెల్లర్స్. ప్రస్తుతం ఇదే అత్యంత చర్చనీయాంశంగా మారింది. 3 రోజుల వ్యవధిలో ఈ ఐపీఓ ఏకంగా 212 రెట్లకుపైగా సబ్‌స్క్రైబ్ కావడం మార్కెట్ వర్గాల్నే ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (NII) విభాగంలో 536 రెట్లు, క్యూఐబీలు 175 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు 95 రెట్లు సబ్‌స్క్రైబ్ చేసుకోవడం ఈ పబ్లిక్ ఇష్యూకు ఉన్న డిమాండ్‌ను స్పష్టం చేస్తోంది. ఈ ఐపీఓకు గ్రే మార్కెట్ ప్రీమియం కూడా దాదాపు 40 శాతానికి అటుఇటుగా ఉండటం ఇన్వెస్టర్లలో మరింత ఉత్సాహాన్ని పెంచింది. అంటే దాదాపు 40 శాతం లాభంతో లిస్టవుతుందని అంచనా వేస్తున్నారు.చిన్న ఐపీఓకే ఈ రేంజ్లో రెస్పాన్స్ ఉంటే మరికొద్ది రోజుల్లో సబ్‌స్క్రిప్షన్‌కు రానున్న ఎన్ఎస్ఈ, రిలయన్స్ జియో, ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ వంటి పెద్ద ఐపీఓలకు ఏ స్థాయిలో ఉండొచ్చన్న ప్రశ్నలు ఇన్వెస్టర్ల మదిలో మెదులుతున్నాయి. అయితే ఇంతకీ ఈ అద్విత్ జువెల్స్ సంగతేంటి.. ఇంత చిన్న ఐపీఓకు అంత భారీ రెస్పాన్స్ ఎందుకు వచ్చింది వంటి వివరాల్ని చూద్దాం.అద్విత్ జువెల్స్ కంపెనీ ఏంటి? ఇది రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన సంప్రదాయ హస్తకళా ఆభరణాల తయారీలో ప్రసిద్ధి చెందింది. రంభాజో బ్రాండ్ పేరిట ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఇదే బ్రాండ్ పేరిట కుందన్, డైమండ్, పోల్కీ, స్టడెడ్ జువెల్లరీ తయారు చేస్తోంది. ఈ బ్రాండ్‌కు సుమారు శతాబ్దానికిపైగా చరిత్ర ఉండటంతో కంపెనీపై మరింత విశ్వసనీయతను పెంచింది. ఐపీఓ ద్వారా సమీకరించనున్న నిధుల్ని మూలధన పెట్టుబడులు, అప్పులు తగ్గించుకోవడం, వ్యాపార విస్తరణ కోసం వినియోగించనున్నట్లు తెలిపింది. పబ్లిక్ ఇష్యూ వివరాలు.. ఈ ఐపీఓ పూర్తిగా ఫ్రెష్ ఇష్యూతో మార్కెట్లోకి వచ్చింది. అంటే తమ దగ్గర ప్రమోటర్ల షేర్లను విక్రయించట్లేదు. కొత్తగా మార్కెట్లోకి షేర్లను విడుదల చేస్తోంది. ఇష్యూ ప్రైస్ రేంజ్ రూ. 130- 138 గా నిర్ణయించింది. ఒక లాట్ కింద కనీసం 100 షేర్లు కొనుగోలు చేయాలి. ఈ లెక్కన అప్పర్ ప్రైస్ దగ్గర కనీస పెట్టుబడి రూ. 13,800 గా ఉంటుంది. సబ్స్క్రిప్షన్ జూన్ 23- 25 మధ్య జరిగింది. జూన్ 29న షేర్ల అలాట్మెంట్ పూర్తి చేసుకొని, జులై 1 న ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది. భారీ రెస్పాన్స్ ఎందుకొచ్చింది? ఈ చిన్న ఐపీఓకు మంచి రెస్పాన్స్ రావడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. ఐపీఓ ప్రారంభానికి ముందే గ్రే మార్కెట్ ప్రీమియం 40-50 శాతం మధ్య ఉంది. అంతే లిస్టింగ్ గెయిన్స్ బాగుంటాయన్న అభిప్రాయం ఒకటి ఇన్వెస్టర్లలో ఏర్పడింది. దీంతో చాలా మంది షార్ట్ టర్మ్ లాభాల కోసం అప్లై చేశారు. ఐపీఓ ద్వారా కేవలం రూ. 165 కోట్ల మేర మాత్రమే నిధుల్ని సమీకరించింది. అంటే ఇష్యూ పరిమాణం చిన్నదిగా ఉండటం, ఇన్వెస్టర్ల సంఖ్య భారీగా ఉండటం వల్ల సబ్స్క్రిప్షన్ గణాంకాలు ఓ రేంజ్లో పెరిగాయి.మంచి ఫలితాలు- జువెల్లరీ రంగంపై విశ్వాసం ఇంకా భారతదేశంలో చూస్తే గోల్డ్, జువెల్లరీ మార్కెట్ నిరంతరం వృద్ది చెందుతూనే ఉంటుంది. పండగలు, పెళ్లిళ్లు, ఎగుమతుల వల్ల ఈ రంగానికి దీర్ఘకాలికంగా కూడా మంచి డిమాండ్ ఉండటంతో పెట్టుబడిదారులు ఈ కంపెనీపై విశ్వాసం చూయించారు. ఇంకా కొన్నేళ్లుగా కంపెనీ లాభం, ఆదాయం పెరుగుతూ రావడం సహా ఈ క్రమంలోనే బ్రోకరేజీలు మంచి రేటింగ్ ఇస్తుండటం ఇన్వెస్టర్లను ఆకర్షించింది. కంపెనీ విలువ అంత ఎక్కువా? అయితే ఇక్కడ 200 రెట్లకుపైగా సబ్స్క్రిప్షన్ జరిగిందంటే కంపెనీ గొప్పదని అర్థం కాదు. చిన్న ఇష్యూ, భారీ లిస్టింగ్ గెయిన్స్ అంచనాలు, తక్కువ ఫ్లోట్ వంటి అంశాలు సబ్‌స్క్రిప్షన్‌ను భారీగా పెంచుతాయి. అందుకే ఈ సబ్స్క్రిప్షన్ రెస్పాన్స్ బట్టి కంపెనీ నాణ్యతను నిర్ణయించడం సరైంది కాదు. ఇదే సమయంలో పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల స్టాక్ మార్కెట్ గత 3 నెలల్లో భారీ ఒడుదొడుకుల్లో ట్రేడైంది. ఇటీవల అమెరికా- ఇరాన్ ఒప్పందంతో మళ్లీ మార్కెట్ పుంజుకుంటోంది. తర్వాత వస్తున్న ఐపీఐ, మంచి జీఎంపీ ఉండటం ప్లస్ పాయింట్‌గా నిలిచింది.జియో, NSE లకు కూడా ఇదే స్థాయిలో డిమాండ్ ఉంటుందా? ఈ క్రమంలోనే త్వరలో రాబోతున్న అతిపెద్ద ఐపీఓలు రిలయన్స్ జియో, ఎన్ఎస్ఈలు కాసుల పంట పండిస్తాయని, మంచి రెస్పాన్స్ లభించొచ్చన్న వాదన వినిపిస్తోంది. కంపెనీల బ్రాండ్, వినియోగదారులు, బలమైన ఆర్థిక స్థితి కారణంగా మంచి డిమాండ్ రావొచ్చు కానీ మెగా ఐపీఓలు ఎక్కువ షేర్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి సబ్స్క్రిప్షన్ ఈ రేంజ్లో ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవి సేకరించే నిధుల పరంగా అతిపెద్ద ఐపీఓలుగా నిలిచే అవకాశం ఉంది. ఇన్వెస్టర్లకు గమనిక ఒక ఐపీఓ భారీగా సబ్‌స్క్రైబ్ అయిందంటే దీర్ఘకాలంలో తప్పనిసరిగా అద్భుత పెట్టుబడి అవుతుందన్న హామీ లేదు. గతంలో చాలా ఐపీఓలు మంచి హైప్‌తో వచ్చినా ఉసూరుమనిపించాయి. వీటిల్లో పేటీఎం, ఎల్ఐసీ వంటివి ఉన్నాయి. కంపెనీ వ్యాపార నాణ్యత, వాల్యుయేషన్, లాభదాయకత, భవిష్యత్ వృద్ధి అవకాశాల్ని పరిశీలించిన తర్వాతే పెట్టుబడి నిర్ణయం తీసుకోవడం మంచిది. ప్రస్తుత అద్విత్ జువెల్లర్స్ ఐపీఓ మాత్రం ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఇంకా బలంగానే ఉందని నిరూపించింది.