“మై బాడీ మై రైట్' అని అమ్మాయిలు అంటే.. చూసేవాడి కళ్లు వాడి ఇష్టం కదా” అంటూ సింగర్ సునీత చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఇటీవల సునీత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
మహిళలకు తమకు నచ్చిన దుస్తులు ధరించే హక్కు ఉన్నప్పటికీ, అది ఇతరులకు అసౌకర్యం కలిగించకూడదని, దాన్ని స్వేచ్చగా పరిగణించలేమని అభిప్రాయపడ్డారు. ఈ కామెంట్స్ పై మరో సింగర్ చిన్మయి శ్రీపాద తీవ్రంగా స్పందించారు. సునీత పట్ల తనకు గౌరవం ఉందని, కానీ ఆమె అలా మాట్లాడటం వల్ల మహిళలకు మరింత డ్యామేజ్ చేస్తుందని అన్నారు. స్వేచ్ఛ అనేది స్త్రీల హక్కు అని స్పష్టం చేశారు. దీనిపై తాజాగా సునీత రియాక్ట్ అవుతూ.. చిన్మయికి కౌంటర్ ఇచ్చారు.సునీత మాట్లాడుతూ.. “ఒక సింగర్ గా చిన్మయిపై నాకూ సేమ్ రెస్పెక్ట్ ఉంది. నా కామెంట్స్ మిస్ లీడ్ అయ్యే అవకాశం ఉందని మీరు అన్నారు. ఆ స్లోగన్ ఏంటి అనేది నాకు చాలా బాగా తెలుసు. ‘మై బాడీ మై విష్’ అనే దానికి అర్ధమేంటో తెలుసు. ‘ఒకరి కంట్రోల్ లో ఉండకపోవడం, నేను వ్యక్తిగా పుట్టాను కాబట్టి, నా బాడీ మీద పూర్తి అర్హత, పూర్తి బాధ్యత నాదే ఎవరి కంట్రోల్ లో ఉండకూడదు’.. ఇలా దీని చుట్టూ రకరకాల అంశాలు ఉన్నాయి. అవన్నీ నాకు తెలుసు. నేను చెప్పింది ఏంటంటే.. ‘మై బాడీ మై విష్’ అన్నప్పుడు, ‘హిస్ ఐస్, హిస్ విష్’ అన్నాను. ఎందుకు అలా అన్నానంటే, అంతకుమించి మన బుర్ర ఎదగలేదు. అలాంటి సొసైటీలో మనం ఉన్నాం. అంతే కానీ, ‘మై హ్యాండ్ మై విష్’ అంటే వెళ్లి వారి చేతులు విరగ్గొట్టే వాళ్లలో ఫస్ట్ నేనుంటాను. మీరు చేసిన పోరాటాల్లో చాలా విషయాలు నాకు నచ్చుతాయి. నేను మిస్ లీడింగ్ గా మాట్లాడటానికి ప్రయత్నించలేదు. మొత్తం ఇంటర్వ్యూ చూస్తే, మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే.. అనుభవించిన వాళ్లలో నేను కూడా ఉన్నాను. నాకు అది ఓకే కాదు” అని అన్నారు.సునీత సినీ రంగంతో పాటు సమాజంలోనూ మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందులు, వివక్షపై గతంలో పలు సందర్భాల్లో తన గళాన్ని వినిపించారు. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ ఫేక్ ఫెమినిజం గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇటీవలి కాలంలో ఫెమినిజం పేరుతో కొందరు వ్యాప్తి చేస్తున్న భావజాలాన్ని తాను అంగీకరించనని సునీత స్పష్టం చేశారు. ఫెమినిజం అంటే మహిళలు వేసుకొనే దుస్తులు, వారు రాత్రిపూట రోడ్లపై తిరగడంలాంటివి కాదన్నారు. తన దృష్టిలో ఫెమినిజం అంటే సమానత్వం అని పేర్కొన్నారు. “నా చుట్టూ అందరూ పురుషులే ఉన్నా, ఒక మహిళగా నా అభిప్రాయాన్ని గౌరవించాలి. స్త్రీలను తెలివితక్కువ వారిగా చూడటం, వారిని తక్కువగా అంచనా వేయడాన్ని ప్రతిఘటించడమే నా ఫెమినిజం'’ అని సునీత చెప్పారు. “మహిళలు, పురుషులు సమానులు కాదు. ఎందుకంటే వారు భిన్నమైన స్వభావం కలవారు. మగవారికి ఉన్న శారీరక బలం ఆడవారికి ఉండకపోవచ్చు. కానీ పురుషులు చేయలేని ఎన్నో పనులను మహిళలు చేయగలరు. సమానత్వం అంటే అందరూ ఒకేలా ఉండటం కాదు.. పరస్పర గౌరవం, అవకాశాల్లో సమానత్వం ఉండటం'’ అని సునీత అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో నీ ఒళ్లు నీ ఇష్టం అంటే, చూసేవాడి కళ్లు వాడి ఇష్టం అంటారు కదా అన్నారు. దీనిపైనే చిన్మయి శ్రీపాద అభ్యంతరం వ్యక్తం చేశారు.