
‘కోట్లు సంపాదించిన వారు కాదు విజేత. కోటి సమస్యలు చుట్టుముట్టినా... చిరుదీపం వెలిగించైనా సరే, ధైర్యంగా వెలుగు దారుల్లో నడిచేవారే విజేత’ అంటారు ఒక రచయిత. ఈ మాటలు సంగీత రాజేకు అక్షరాలా సరిపోతాయి.
Jun 26 2026 6:02 AM | Updated on Jun 26 2026 6:02 AM
‘కోట్లు సంపాదించిన వారు కాదు విజేత. కోటి సమస్యలు చుట్టుముట్టినా... చిరుదీపం వెలిగించైనా సరే, ధైర్యంగా వెలుగు దారుల్లో నడిచేవారే విజేత’ అంటారు ఒక రచయిత. ఈ మాటలు సంగీత రాజేకు అక్షరాలా సరిపోతాయి. ఆమెకు సంబంధించిన విశిష్ఠత... రచయిత్రి, డిజిటల్ క్రియేటర్, పాడ్‌కాస్టర్ కావడం కాదు. తల్లి చనిపోయిన దుఃఖం నుంచి తేరుకోక ముందే రెండుసార్లు క్యాన్సర్ బారిన పడింది. ‘నా జీవితానికి ఇక ఏం మిగిలింది!’ అనుకునే క్లిష్ట దశలో కూడా ఆమె పెదవులపై చిరునవ్వు చెరిగిపోలేదు. పూణేకు చెందిన సంగీత రాజే తొలి పుసక్తం ‘లైట్ బియాండ్ ది షాడోస్: ఏ ట్రూ స్టోరీ’ ఎంతోమంది రోగులకు «ధైర్యాన్ని ఇస్తోంది. స్వస్థత శక్తి సానుకూల దృక్పథంలోనే ఉందని గట్టిగా చెబుతోంది....
తల్లిదండ్రులను కోల్పోయిన దుఃఖం, శస్త్ర చికిత్సలు, సంవత్సరాల తరబడి నొప్పి... మరో వ్యక్తి అయితే... ‘ఈ జీవితం కంటే చావు నయం’ అనుకునేవారేమో. సంగీత రాజే మాత్రం ఎప్పుడూ అలా అనుకోలేదు. జీవనకాంక్ష ఆగిపోలేదు. అద్భుతమైన ఆత్మస్థైర్యంతో ఆశకు ఎప్పుడూ దగ్గరగానే ఉంది.
బరువైన బాల్యం ‘పదకొండు సంవత్సరాల వయసులో మా నాన్నను కోల్పోయాను. మేము బతకడం కోసం అమ్మ మా ఇంటిని అమ్మేయాల్సి వచ్చింది. చాలా చిన్న వయసులోనే జీవితం ఒక పోరాటంగా మారింది. బాల్యం అకస్మాత్తుగా బరువుగా మారింది. ఆర్థిక ఇబ్బందులు దైనందిన జీవితంలో భాగమయ్యాయి’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది సంగీత.
పదిహేనేళ్ల వయసులోనే సంగీతకు పెళ్లయింది. ఒక బిడ్డకు జన్మనిచ్చి ఆమె అక్క చనిపోయింది. అక్క బిడ్డకు అమ్మలేని లోటును తీర్చడానికి సంగీత చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆడిపాడే వయసు దుఃఖం, బాధ్యతలతో నిండిపోయింది. అయితే... మాతృత్వం అనేది సంగీత జీవితంలోకి కొంత సంతోషాన్ని తీసుకువచ్చింది. కానీ రెండు సంవత్సరాల తరువాత ఊహించని విషాదం చుట్టు ముట్టింది.
అడుగడుగునా అనారోగ్య సమస్యలు ఇరవై రెండు ఏళ్ల వయసులో సంగీత రాజేకు లూపస్ అనేప్రాణాంతకమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. లూపస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి. శరీర రోగనిరోధక వ్యవస్థ దాని స్వంత కణజాలాలపైనే దాడి చేస్తుంది. ఇది అనేక అవయవాలను ప్రభావితం చేస్తుంది. సంవత్సరాల తరబడి జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులు, సూర్యరశ్మితో వచ్చే అలర్జీలు, తల తిరగడం...ఇలా ఎన్నో! అడుగడుగునా అనారోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ కుటుంబ బాధ్యతలు మోస్తూనే రోజువారీ జీవితాన్ని కొనసాగించింది. 2019లో సంగీతకు మరో షాక్! ఆమెకు మెదడు క్యాన్సర్ అని నిర్ధారణ అయింది.
అరుదైన కేసు... అన్నారు! ‘నేను జీవించడానికి ఏ ఆశ లేదని చాలామంది భావించారు. కాని నేను ధైర్యంగా నిలబడ్డాను. క్యాన్సర్ గురించి ఆలోచిస్తూ బాధ పడి, భయపడడం కంటే మధుర జ్ఞాపకాలను పదే పదే గుర్తు చేసుకునేదాన్ని. భయాన్ని కాదు జీవనోత్సాహాన్నే నా ప్రపంచానికి కేంద్రబిందువు చేసుకున్నాను’ అని గతాన్ని గుర్తు చేసుకుంది సంగీత. విధి ఆమెను పరీక్షించడం ఇంకా ఆపలేదు. అమ్మ చనిపోయిన దుఃఖం నుండి తేరుకోక ముందే... ఆరు నెలల తరువాత సంగీతకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ‘మీది అరుదైన కేసు అని వైద్యులు నాతో చెప్పారు. నా శరీరంలో ఒకే సమయంలో రెండు వేర్వేరు క్యాన్సర్లు ఉన్నాయి. ఆ సమయంలో కుటుంబ బలమే నాకు అండగా నిలిచింది. ఆపరేషన్, కీమో థెరపీ సెషన్, రేడియేషన్ సైకిల్స్‌లో నా కుటుంబం నాకు ధైర్యాన్ని ఇచ్చింది’ అంటుంది సంగీత.
స్వస్థపరిచే శక్తి మనసులోనే! రచనలు, రీల్స్, పాడ్‌కాస్ట్ ద్వారా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఎంతోమందితో తన జీవిత అనుభవాలను పంచుకుంటూ ధైర్యాన్ని ఇస్తోంది సంగీత. వారికి ఆమె ఇచ్చే సలహా... ‘స్వస్థపరిచే శక్తి మన మనస్సులో, అంతర్గత బలంలోనే ఉంది. యస్...నేను తప్పనిసరిగా కోలుకుంటాను అని ఒకటికి రెండుసార్లు బలంగా అనుకోండి. మన ఆలోచనలు శక్తిమంతమైనవి. శరీరం అవి వింటుంది. అదే సమయంలో సానుకూలంగా స్పందిస్తుంది. చీకటి రోజుల్లో... నిజం చెప్పాలంటే అనారోగ్యం అనేది నన్ను పెద్దగా భయపెట్టలేదు. అయితే నన్ను బాగా భయపెట్టిన విషయం మాత్రం ఒకటి ఉంది. నాకు ఆపరేషన్ జరిగితే, కోమాలోకి వెళితే కుటుంబ సభ్యులకు దూరమవుతానేమో, వారికి భారం అవుతానేమో అనేదే ఆ భయం. ఈ ఆలోచన అనారోగ్యం కంటే చాలా భయపెట్టేది. ఏది ఎలా జరిగినా భయంతో జీవించకూడదని నేను గట్టి నిర్ణయం తీసుకున్నాను. ప్రతి సవాలును చిరునవ్వుతో ఎదుర్కోవడానికి సిద్ధం అయ్యాను. అత్యంత చీకటి రోజుల్లో కూడా నవ్వగలగడం అనేది నా జీవితానికి వెలుగు, బలం అయింది. – సంగీత రాజే
గ్రాండ్‌గా ఖుష్బు కుమార్తె పెళ్లి వేడుక.. టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)
మాటా వేడుకలో టాలీవుడ్ సినీతారల సందడి (ఫొటోలు)
మ్యాడ్ బ్యూటీ రెబా మోనికా జాన్ బేబీమూన్ ట్రిప్ (ఫొటోలు)
గ్రాండ్‌గా జబర్దస్త్ ఫైమా పెళ్లి వేడుక (ఫొటోలు)
రజినీకాంత్ ధర్మాన్ మూవీ ఈవెంట్లో సిమ్రాన్ (ఫొటోలు)
రూ.10 షేర్.. రూ. 5,800 కోట్ల రిటర్న్స్.. JIOలో మహేంద్ర నహతా సంచలనం
ఆస్తులమ్మి SPIRIT సినిమా తీశాం, సందీప్ రెడ్డి వంగాకు మేం చెప్పేది ఒక్కటే..!