
వ్యాపార సంస్థలు తమ వస్తువులను, సేవలను ప్రచారం చేసుకోవడం వ్యాపార వృద్ధికి అవసరం. కానీ ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రభుత్వాలు తమ గురించీ, తమ పథకాల గురించీ విపరీతంగా ప్రచారం చేసుకోవడం, దానికోసం వేల కోట్ల...
Jun 25 2026 2:40 PM | Updated on Jun 25 2026 2:50 PM
వ్యాపార సంస్థలు తమ వస్తువులను, సేవలను ప్రచారం చేసుకోవడం వ్యాపార వృద్ధికి అవసరం. కానీ ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రభుత్వాలు తమ గురించీ, తమ పథకాల గురించీ విపరీతంగా ప్రచారం చేసుకోవడం, దానికోసం వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించడం సమంజసమేనా?
2026–27లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటు రూ. 75,868 కోట్లు (జీఎస్డీపీలో 3.8%). కేంద్ర ఆర్థిక సంఘం నిర్దేశించిన 3% పరిమితిని మించిపోయింది. మొత్తం బకాయి అప్పులు జీఎస్డీపీలో 36% వద్ద ఉన్నాయి. రెవెన్యూ లోటు 1.1%. ఏటా వేల కోట్ల అప్పు తీసుకుంటూ, కేంద్ర గ్రాంట్లపై అధికంగా రాష్ట్రం ఆధారపడుతోందని కాగ్ నివేదికలు, బడ్జెట్ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంత తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలోనూ ప్రచార ఖర్చులు తగ్గకపోగా పెరగడం విడ్డూరం.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమరావతి పునర్నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణ, పాలనా విజయాల ప్రచారం కోసం విపరీతంగా ఖర్చు చేస్తోంది. 2025 సెప్టెంబర్ 10న అనావృష్టి పీడిత అనంతపురంలో ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభ ఈ ప్రచార పర్వానికి నిదర్శనం. హామీలు పూర్తిగా నెరవేరకుండానే విజయోత్సవం జరుపుకోవడాన్ని ‘పీఆర్ మాయాజాలం’.
పెట్టుబడులను ఆహ్వానించే పేరుతో 2025 నవంబర్ 14–15న విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్‌ను ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ‘ముందుగా సిద్ధం చేసిన ప్రచార ప్రహసనం’గా అభివర్ణించింది. అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు కర్మాగారం వంటి ప్రాజెక్టుల పునరుద్ధరణను హడావుడిగా ప్రచారం చేయడం, దావోస్‌లో రూ. 10 లక్షల కోట్ల హరిత ఇంధన పెట్టుబడుల వాగ్దానం గురించి ప్రచారం చేయడం కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో ఊహించడం కష్టమేమీ కాదు.
సుప్రీం కోర్టు ఏం చెప్పింది? ఈ ఖర్చులు కేవలం దుబారా మాత్రమే కాదు, చట్టపరమైన నిబంధనలకూ విరుద్ధం. 2015 మే 13న ‘కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (రిట్ పిటిషన్ నం. 13/2003) కేసులో జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం, ప్రభుత్వ ప్రక టనల నియంత్రణకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. వాటి ప్రకారం ప్రకటనలు ప్రభుత్వ రాజ్యాంగ, చట్టపరమైన బాధ్యతలకు సంబంధించిన సమాచారం కోసమే ఉండాలి; వ్యక్తులను లేదా రాజకీయ పార్టీలను కీర్తించడానికి కాదు. వ్యక్తిపూజ ‘ప్రజాస్వామ్య ప్రభుత్వానికి సరాసరి విరుద్ధం’ అని కోర్టు పేర్కొంది.
ఖర్చు పొదుపుగా, పన్ను చెల్లింపుదారుల సొమ్ముకు గరిష్ఠ విలువ లభించేలా ఉండాలి. ముఖ్యంగా, ప్రతి శాఖా, ప్రభుత్వ రంగ సంస్థా తన ప్రకటనల బడ్జెట్‌ను బహిర్గతం చేసి కాగ్ ఆడిట్‌కు లోబడాలి. ప్రక టనల కంటెంట్‌ను పర్యవేక్షించేందుకు ప్రతి రాష్ట్రమూ ముగ్గురు సభ్యుల కమిటీని (సీసీఆర్జీఏ) ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. చాలా రాష్ట్రాల్లో లాగానే ఇక్కడా ఈ కమిటీలు సమర్థంగా పనిచేయడం లేదు. ప్రకటనల బడ్జెట్‌ను బహిర్గతం చేయకపోవడం, ఆడిట్‌కు లోబడకపోవడం, కోర్టు నిర్దేశించిన పారదర్శకతా సూత్రాన్ని తుంగలో తొక్కడం ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది.
సోషల్ మీడియాలోనూ ప్రభుత్వ ఖాతాలు, ప్రాయోజిత ప్రకటనలు పెద్దఎత్తున నడుస్తున్నాయి. ఫలితంగా సామాన్య ప్రజలు అవాస్తవ సమాచారానికి, అతిశయోక్తులకు బలవుతూ వాస్తవానికి దూరమవుతున్నారు. అంతిమంగా, ఈ ఆర్భాటపు ప్రచారానికి అయ్యే ఖర్చును భరిస్తున్నది ఎవరు? ప్రజలే. ప్రభుత్వం సుప్రీం కోర్టు మార్గదర్శకాలను గౌరవించి, నిజమైన అభివృద్ధివైపు మళ్లాలి. లేకుంటే, ఈ ‘ప్రచార పర్వం’ ప్రజాధనానికి తూట్లు పొడుస్తూనే ఉంటుంది.
– డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ సీనియర్ జర్నలిస్ట్
నాగదుర్గ 'ఇడుపు కాయితం' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
ముంబైలో అట్టహాసంగా ' స్టైల్ ఐకాన్స్ సమ్మిట్ అవార్డ్స్ 2026' వేడుక (ఫొటోలు)
షూటింగ్‌లకు బ్రేక్.. నేపాల్‌ప్రకృతి ఒడిలో మీనాక్షి చౌదరి (ఫోటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నాని (ఫొటోలు)
39 సెకన్ల తేడాతో.. వెనెజువెలాలో మహా విధ్వంసం! (ఫొటోలు)
పోలీస్ VS చక్రవర్తి, ఒక్కడిని విసిరి పడేసాడు
రాబోయే రెండేళ్లు దద్దరిల్లిపోద్ది.. గుర్తుపెట్టుకో చంద్రబాబు
దుమారం రేపుతున్న పవన్ కామెంట్స్.. తిరగబడుతున్న ప్రజలు!