
పిల్లల పెంపకంలో చాలామంది పేరెంట్స్ కొన్ని సాధారణ తప్పులు చేస్తుంటారు. ఇవి చిన్నవిగా కనిపించినా పిల్లల మానసిక, భావోద్వేగ, ప్రవర్తనా అభివృద్ధిపై పెద్ద ప్రభావం చూపుతాయి.
నిపుణుల ప్రకారం, ఈ తప్పులను గుర్తించి సరిచేసుకుంటే పిల్లల భవిష్యత్ అందంగా మారుతుంది. మరి ఆ తప్పులేంటో తెలుసుకోండి.
చాలామంది తల్లిదండ్రులు “పక్కింటి పిల్లలు ఎంత బాగా చదువుతున్నారో చూడు” వంటి మాటలు చెబుతుంటారు. కానీ ఈ పోలికలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి. ప్రతి పిల్లాడు ప్రత్యేకమైన ప్రతిభతో ఉంటాడు. పిల్లలను ఇతరులతో కాకుండా వారి గత పనితీరుతో మాత్రమే పోల్చాలి. నిన్నటికంటే నువ్వు ఈ రోజు బాగా చేశావు వంటి మాటలు వారి ఎదగుదలకు సహాయపడతాయి.
కొంతమంది పేరెంట్స్ పిల్లల ప్రతి చర్యను నియంత్రించాలనుకుంటారు. ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అన్నది పూర్తిగా నిర్ణయిస్తారు. ఇది పిల్లల్లో స్వతంత్ర ఆలోచనను తగ్గిస్తుంది. పిల్లలు చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోవాలి. పేరెంట్స్, గైడెన్స్ ఇవ్వాలి కానీ అతిగా కంట్రోల్ చేయకూడదు.
చాలామంది పేరెంట్స్ పిల్లల మార్కులు, చదువు మీద మాత్రమే దృష్టి పెడతారు కానీ వారి ఎమోషన్స్ ని పట్టించుకోరు. పిల్లలు బాధపడుతున్నా, భయపడుతున్నా లేదా ఒత్తిడిలో ఉన్నా పట్టించుకోకపోవడం వల్ల వారు లోపలే ఒంటరితనాన్ని అనుభవిస్తారు. నిపుణుల ప్రకారం పిల్లలతో రోజుకు కనీసం కొంత సమయం మాట్లాడాలి. వారి మనసు తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
ఈ రోజుల్లో మొబైల్, టాబ్లెట్, టీవీలు పిల్లల జీవితంలో భాగమైపోయాయి. కానీ చాలామంది పేరెంట్స్ నియంత్రణ లేకుండా వదిలేస్తారు. లేదా ఒక్కసారిగా పూర్తిగా నిషేధిస్తారు. అయితే ఈ రెండూ సరైనవి కాదు. నిపుణుల ప్రకారం సమతుల్యత అవసరం. రోజుకు నిర్దిష్ట సమయం మాత్రమే స్క్రీన్ వాడేలా చేయాలి, అలాగే బయట ఆటలు, పుస్తకాలు చదివేలా ప్రోత్సహించాలి.
ఫస్ట్ ర్యాంక్ రావాలి, నువ్వు అది కావాలి, ఇది కావాలి వంటి ఒత్తిడులు పిల్లలపై చాలా ప్రభావం చూపుతాయి. ప్రతి పిల్లవాడికి ప్రత్యేకమైన ఆసక్తులు, సామర్థ్యాలు ఉంటాయి. అధిక ఒత్తిడి వల్ల వారు స్ట్రెస్‌కు లోనవుతారు. చదువుపై ఆసక్తి కోల్పోతారు. నిపుణుల ప్రకారం పిల్లల ఆసక్తిని గుర్తించి దానికి అనుగుణంగా ప్రోత్సహించాలి. విజయాన్ని మాత్రమే కాకుండా ప్రయత్నాన్ని కూడా మెచ్చుకోవాలి.