డిజిటల్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ డిజిటల్ పటంలో హైదరాబాద్ స్థానాన్ని సుస్థిరం చేయడమే లక్ష్యంగా దేశంలోనే మొట్టమొదటి ప్రత్యేక డేటా సెంటర్...
డిజిటల్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ డిజిటల్ పటంలో హైదరాబాద్ స్థానాన్ని సుస్థిరం చేయడమే లక్ష్యంగా దేశంలోనే మొట్టమొదటి ప్రత్యేక డేటా సెంటర్ సిటీ స్థాపనకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌కు శివారులో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూర్ గ్రామంలో సుమారు 1500 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ ప్రాజెక్టును నిర్మించనున్నారు. అంతర్జాతీయ స్థాయి హైపర్‌స్కేల్ డేటా నిర్వాహకులను ఆకర్షించేలా, పర్యావరణ అనుకూలమైన స్థిరమైన మౌలిక సదుపాయాలు, నిరంతర విద్యుత్ సరఫరాతో ఈ సిటీని డిజైన్ చేస్తున్నారు.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతిపాదిత డేటా సెంటర్ సిటీకి అవసరమైన నీరు, విద్యుత్, ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి మౌలిక వసతులపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఐటీ, పరిశ్రమల శాఖ ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని గుర్తించి, ప్రాథమిక ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో 150 నుంచి 200 మెగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్లు నడుస్తుండగా.. ప్రభుత్వం భూములు కేటాయించిన మరో 5 గిగావాట్ల ప్రాజెక్టులు పైప్‌లైన్‌లో ఉన్నాయి. రాబోయే రోజుల్లో వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా తెలంగాణలో మొత్తం డేటా సెంటర్ల సామర్థ్యం ఏకంగా 11 గిగావాట్లకు పైగా దాటనుందని సీఎంవో కార్యాలయం వెల్లడించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ దిగ్గజాలతో పాటు CtrlS, క్యాపిటాలాండ్, NTT డేటా, సిఫీ, ఎస్టీటీ గ్లోబల్ వంటి సంస్థలు తమ కేంద్రాలను నడుపుతున్నాయి.డేటా సెంటర్ల నిర్వహణకు భారీగా నీటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా చందన్వెల్లి, భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలోని క్లస్టర్ల నీటి ఎద్దడిని నివారించేందుకు ప్రభుత్వం సర్క్యులర్ ఎకానమీ విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా నగరంలోని సెవెజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నుంచి సేకరించిన మురుగునీటిని అత్యాధునిక సాంకేతికతతో శుద్ధి చేసి పరిశ్రమలకు సరఫరా చేస్తారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ పద్ధతిలో ఈ నీటి సరఫరా ప్రాజెక్టును చేపట్టనున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ ప్రస్తుతం రోజుకు 1750 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసే సామర్థ్యంతో 41 ఎస్టీపీలను నిర్వహిస్తోంది. ఇందులో నుంచి దాదాపు 530 ఎమ్ఎల్డీ శుద్ధి చేసిన నీటిని పారిశ్రామిక అవసరాల కోసం మళ్లించేలా డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు.దీని కోసం రెండు ప్రధాన పైప్‌లైన్ మార్గాలను అధికారులు ప్రతిపాదించారు. మొదటిది.. అత్తాపూర్ ఎస్టీపీ నుంచి చందన్వెల్లి వరకు 41 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్ నిర్మిస్తారు. దీని ద్వారా చందన్‌వెల్లిలోని డేటా సెంటర్లు, వెల్స్పన్ వంటి ఉత్పాదక పరిశ్రమలకు ద్వితీయ, తృతీయ శ్రేణిలో శుద్ధి చేసిన నీటిని అందిస్తారు. ఇక్కడ 2035 నాటికి నీటి డిమాండ్ 239 ఎమ్ఎల్డీకి చేరుతుందని అంచనా. ఇక రెండోది, నాగోల్ ఎస్టీపీల నుంచి నెట్ జీరో స్మార్ట్ అర్బన్ డెవలప్‌మెంట్‌గా రూపుదిద్దుకుంటున్న భారత్ ఫ్యూచర్ సిటీ వరకు 56.6 కిలోమీటర్ల పైప్‌లైన్ వేస్తారు. ఇక్కడ 2035 నాటికి డిమాండ్ 290 ఎమ్ఎల్డీగా ఉండనుంది. ఈ రెండు పైప్లైన్లు 158 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి సాగడం వల్ల రామచంద్రాపురం, పటాన్చెరు, బీహెచ్ఈఎల్, సుల్తాన్పూర్, జీడిమెట్ల వంటి పారిశ్రామిక ప్రాంతాలకు కూడా ఈ నీరు ఉపయోగపడనుంది. అలాగే ఓఆర్ఆర్ వెంబడి మొక్కల పెంపకానికి, అగ్నిమాపక అవసరాలకు కూడా ఈ నీటిని వాడుకుంటారు. విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే ఈ రంగం కోసం కంపెనీలకు ఓపెన్ యాక్సెస్ ద్వారా విద్యుత్ పొందే సదుపాయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు దగ్గరగా ఉండటం, మౌలిక వసతులు బాగుండటంతో చందన్వెల్లి, ఫ్యాబ్ సిటీలు ఇప్పటికే అంతర్జాతీయ పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి.