
ప్రకృతి సృష్టించిన భీభత్సానికి వెనిజులా దేశం అతలాకుతలమైంది. బ్యాక్-టు-బ్యాక్ సంభవించిన భయంకరమైన భూకంపాల ధాటికి దేశవ్యాప్తంగా వందలాది భవనాలు కుప్పకూలడంతో..
ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని (State of Emergency) ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఘోర విపత్తులో భారీగా ప్రాణనష్టం జరిగిందని తాత్కాలిక దేశాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ అధికారికంగా ధృవీకరించారు. ప్రభుత్వ జాతీయ టెలివిజన్ ద్వారా ఆమె దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. భూకంపం కారణంగా తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారందరికీ తీవ్ర సంతాపం తెలియజేశారు. ప్రస్తుతం శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోయారని, వారిని రక్షించేందుకు అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయని వెల్లడించారు.యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) నివేదికల ప్రకారం.. రాజధాని కారకాస్‌కు పశ్చిమంగా 284 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాన్ ఫెలిపే సమీపంలో రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో మొదటి భూకంపం సంభవించింది. ఇది జరిగిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే యుమారే పరిసర ప్రాంతంలో 7.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించి ఒక్కసారిగా వెనిజులాను కుదిపేసింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం, కేవలం 15 కిలోమీటర్ల లోతులోనే ఈ ప్రకంపనలు కేంద్రీకృతమవడం వల్ల విపత్తు తీవ్రత మరింత పెరిగింది.Earthquakes: ఒకేసారి రెండు భారీ భూకంపాలు! అంచనా వేయలేనంత ప్రాణనష్టం?రంగంలోకి సహాయక బృందాలు.. ఉత్కంఠ రేపుతున్న పరిస్థితులుభూకంప తీవ్రత దృష్ట్యా దేశవ్యాప్తంగా సహాయక చర్యలను వెనిజులా ప్రభుత్వం పూర్తిస్థాయిలో ముమ్మరం చేసింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్స్ రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. లౌడ్‌స్పీకల ద్వారా స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. జాతీయ టెలివిజన్ వేదికగా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన డెల్సీ రోడ్రిగ్జ్.. ప్రకృతి విపత్తులో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున తీవ్ర సానుభూతి తెలిపారు. అయితే ఖచ్చితమైన మృతుల సంఖ్యను వెల్లడించడానికి మరికొంత సమయం పడుతుందని ఆమె వివరించారు.తీవ్ర నష్టం ప్రభావంతో మరణాల సంఖ్య భారీగా ఉండవచ్చని యూఎస్ జీఎస్ అంచనా వేసింది. విపత్తు ప్రభావం తీవ్రంగా ఉన్నందున దాదాపు 10,000 నుంచి ఒక లక్ష వరకు ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని నిపుణులు ముందస్తుగా అంచనా వేస్తున్నారు. భూప్రకంపనలతో భయపడిన వేలాది మంది ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తి వీధుల్లోనే కాలం గడుపుతున్నారు. భవనాలు దెబ్బతిన్న మార్గాలలో శిథిలాలు పేరుకుపోవడంతో సహాయక వాహనాలు ఘటనా స్థలాలకు చేరుకోవడానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. భారీ భూకంపం- వణికిన తూర్పు తీరంవ్యక్తమవుతున్న ఆందోళనలు.. ప్రార్థనల్లో అంతర్జాతీయ సమాజంఈ పెను ఉపద్రవంపై వెనిజులా ప్రతిపక్ష నేత ఎడ్మండ్ గొంజాలెజ్ స్పందిస్తూ.. వరుస భూకంపాల వల్ల ప్రజలు ప్రాణభయంతో వీధుల్లోనే కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సమాచార వ్యవస్థలు దెబ్బతినడంతో విదేశాల్లో ఉన్న వెనిజులా పౌరులు తమ దేశంలోని కుటుంబీకుల క్షేమ సమాచారాలను తెలుసుకోలేక తీవ్రమైన ఆందోళనను ఎదుర్కొంటున్నారని స్పష్టం చేశారు. మరోవైపు ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నాయిబ్ బుకెలేతో పాటు నోబెల్ గ్రహీత మరియా కొరినా మచాడో బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ వెనిజులా ప్రజలకు తమ సంఘీభావం ప్రకటించారు.కారకాస్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సైతం ఈ విపత్కర పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది. అమెరికన్ పౌరులు దెబ్బతిన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని, సురక్షితమైన ఆశ్రయాలను పొందాలని అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రైవేట్, ప్రభుత్వ రెస్క్యూ సంస్థలు సమన్వయంతో సహాయక చర్యల్లో పాల్గొంటున్న వేళ, ఈ ఘోర విపత్తు నుండి దేశం త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు.