
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
BRS Party: తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అన్ని స్థానాల్లో కారు గుర్తుదే గెలుపు అని.. కరీంనగర్ జిల్లాలో కారు గుర్తు సునామీ ఖాయం అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా అనాదిగా బీఆర్ఎస్ పార్టీకి కోట అని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ఎండగట్టేందుకు మరింత పెద్ద ఎత్తున ప్రజల్లోకి పోవాలని గులాబీ పార్టీ సైన్యానికి సూచించారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల పైన కదం తొక్కాలని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. పార్టీ క్షేత్రస్థాయి బలోపేతంతోపాటు సమకాలీన రాజకీయాలపై దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఒక కోట మాదిరిగా అండగా ఉందని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు మోసాలతో కొన్ని స్థానాలు కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రెండున్నరేళ్ల విఫల పరిపాలన తర్వాత తిరిగి ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ వైపు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు చూస్తున్నారని చెప్పారు. పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో కరీంనగర్ జిల్లాలో కారు గుర్తు మరోసారి సునామీ సృష్టించబోతుందని మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లాలో అత్యంత కీలకమైన సింగరేణిపై బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్రలు, అవినీతిని ఎక్కడికక్కడ ప్రజల ముందుకు, సింగరేణి కార్మికుల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గానికి మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న అరాచకాలను, అవినీతిని ఎక్కడికక్కడ ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు. ఇక పార్టీ నిర్మాణానికి సంబంధించి బూత్‌ల వారీగా ప్రత్యేక కార్యాచరణ తీసుకొని ముందుకుపోవాలని చెప్పారు. గ్రామస్థాయి పార్టీ కార్యాచరణ కాకుండా బూత్‌ల వారీగా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు పోవాలన్నారు. అధికారం ఉన్నా లేకున్నా మన వెంట నాయకుల వెంట నిలబడిన ప్రతి ఒక్క కార్యకర్తను గుండెల్లో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తించాలి. కార్యకర్తలతోనే పార్టీ బలంగా నిలబడిందనే విషయాన్ని గ్రహించి ముందుకుపోవాలి' అని సూచించారు.
కరీంనగర్లో కాళేశ్వరం ప్రాజెక్టు అందించిన ప్రతిఫలాలను ప్రజలకి గుర్తు చేయాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. కరువు వచ్చినప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు విలువ తెలుస్తుందని.. ఆ విషయం ముమ్మాటికి నిజమవుతున్నదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు అందిన కాడికి దోచుకుంటున్న తీరును ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ నాయకత్వానికి సూచించారు. పార్టీ నాయకులంతా మారుతున్న ప్రస్తుత కాలానికి అనుగుణంగా సామాజిక మాధ్యమాలను వినియోగించుకుని ప్రజల మనసులను గెలుచుకునే ప్రయత్నం చేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.