
బీహార్ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఇండిపెండెంట్ జర్నలిస్ట్ భరత్ భూషణ్ తివారి ఎన్కౌంటర్ ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియా వేదికగా లక్షలాది మంది
ఫాలోవర్లను సంపాదించుకున్న ఒక సాధారణ డిజిటల్ జర్నలిస్ట్, తుపాకీ పట్టుకుని లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ చివరకు పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడం వెనుక ఉన్న అసలు నిజాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఎన్ కౌంటర్ పై ప్రముఖ విశ్లేషకుడు భరద్వాజ్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. షాపూర్ ప్రాంతంలో వరద ముంపునకు గురవుతున్న అట్టడుగు వర్గాలు, నిర్వాసితుల పక్షాన నిలబడి నిలదీసే ఒక సాహసోపేతమైన గొంతుగా భరత్ భూషణ్ తివారికి అక్కడ ఇమేజ్ ఉంది. అధికారుల అవినీతిని, ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న అక్రమాలను నేరుగా ఫీల్డ్ నుంచే కెమెరాలకు చూపిస్తూ.. నేరుగా పేర్లు పెట్టి హెచ్చరించే తివారి ధోరణి స్థానిక పాలకులకు, అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.
సాధారణంగా కెమెరా ముందు కూర్చోవడమే కాకుండా, స్వయంగా ప్రజల సమస్యలు ఉన్న స్పాట్‌కు వెళ్లి లైవ్ వీడియోలు చేయడం అతని ప్రత్యేకత. అయితే, వ్యవస్థలోని లోపాలను ఎండగట్టే క్రమంలో అతను ఉపయోగించిన అత్యంత అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్, అధికారుల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఒకానొక దశలో ఈ లంచగొండి వ్యవస్థను కేవలం మాటలతో మార్చలేమని, ప్రజల హక్కుల కోసం ఆయుధాలు చేతబట్టాల్సిందేనంటూ సాయుధ పోరాట రాజకీయాల వైపు మళ్లాలని తన వీడియోల్లో పిలుపునిచ్చాడు. ఈ క్రమంలోనే ఒక గన్ సంపాదించి తన వద్దే ఉంచుకున్నాడు. ఈ పరిణామాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారడంతో, అతనికి వరుసగా హెచ్చరికలు జారీ అయ్యాయి. తనపై ఏ క్షణమైనా దాడి జరగవచ్చని తివారి కూడా ముందుగానే ఊహించి వీడియోలు చేశాడు.
చివరకు ఒకరోజు పోలీసులు అతని ఇంటిని చుట్టుముట్టినప్పుడు, భరత్ భూషణ్ తివారి నేరుగా తన మేడపైకి వెళ్లి ఫేస్బుక్ లైవ్ ఆన్ చేశాడు. చేతిలో తుపాకీ పట్టుకుని, "కింద అంతా గొడవ జరుగుతోంది, పోలీసులతో తేల్చుకుందాం" అంటూ అగ్రెసివ్‌గా మాట్లాడుతూ లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చాడు. బీహార్ మొత్తం ఆ లైవ్ వీడియోను ఉత్కంఠగా చూస్తుండగానే, ఒక్కసారిగా సోషల్ మీడియా లైవ్ కట్ అయిపోయింది. ఆ తర్వాత వినిపించింది కేవలం బుల్లెట్ల శబ్దమే. లైవ్ ముగిసిన కొద్దిసేపటికే భరత్ భూషణ్ తివారి ఎన్కౌంటర్ వార్త బయటకు వచ్చింది. పోలీసులు దీనిని ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పులుగా చెబుతున్నప్పటికీ.. తివారి తల్లిదండ్రులు మాత్రం ఇది ముమ్మాటికీ ప్రణాళికాబద్ధంగా జరిగిన బూటకపు ఎన్కౌంటర్, ప్రభుత్వ హత్యేనని తీవ్రంగా ఆరోపిస్తున్నారు. చనిపోయే ఆఖరి నిమిషంలో తన కొడుకు సరెండర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నా, పోలీసులు వినకుండా కాల్చి చంపేశారని తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు.
సాధారణంగా ఒక వ్యక్తిపై కేసు ఉంటే నలుగురు పోలీసులు వచ్చి సమన్లు ఇచ్చి తీసుకెళ్లవచ్చు, కానీ ఒక క్రిమినల్ కాని వ్యక్తి ఇంటిని వందలాది మంది సాయుధ పోలీసులు చుట్టుముట్టి ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్న భరద్వాజ. భరత్ భూషణ్ తివారి అంత్యక్రియలకు బీహార్‌లోని అనేక ప్రాంతాల నుండి వేలాది మంది పేదలు, అట్టడుగు వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడం ఆయనకు ఉన్న ఇమేజ్ కు, మద్దతుకు అద్దంపడుతోందన్నారు. నాడు విజయవాడలో వంగవీటి మోహన రంగా హత్య జరిగినప్పుడు పేదలు ఏ విధంగా రోడ్లపైకి వచ్చి తిరగబడ్డారో, సరిగ్గా అదే తరహాలో బీహార్ అట్టడుగు ప్రజలు తివారిని తమ సొంత హీరోగా భావించి కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ వివాదాస్పద ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ జరపాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని భరద్వాజ చెప్పారు.
.