
అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Lionel Messi Top 10 Unknown Facts: ఫుట్‌బాల్ గ్రౌండ్లో డిఫెండర్లను ముప్పుతిప్పలు పెడుతూ.. గోల్‌కీపర్లను బోల్తా కొట్టిస్తూ.. తన ఆటతీరుతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ బర్త్ డే నేడు. నేడు (జూన్ 24) 39వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2026లోనూ అల్జీరియాపై హాట్రిక్, ఆస్ట్రియాపై బ్రేస్ (రెండు గోల్స్)తో అర్జెంటీనాను నాకౌట్ వైపు నడిపిస్తూ.. మెస్సీ తన కెరీర్లో అత్యుత్తమ ఫామ్‌లో దుమ్ములేపుతున్నారు. ఫుట్‌బాల్ కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ (18) సాధించిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. రొసారియోలో జన్మించిన ఈ ఫుట్‌బాల్ దిగ్గజం.. తన బర్త్ డేకు తనకు తానే మంచి గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. మెస్సీ గురించి టాప్-10 విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
మెస్సీ పూర్తి పేరు ‘లియోనెల్ ఆండ్రెస్ మెస్సీ’. 1987లో మెస్సీ పుట్టినప్పుడు.. ఆయన తల్లికి అమెరికన్ ఫేమస్ పాప్ సింగర్ 'లియోనెల్ రిచీ' అంటే చాలా ఇష్టం. ఆ అభిమానంతోనే తన కొడుకుకు ‘లియోనెల్’ అని పేరు పెట్టారు.
మెస్సీకి 13 ఏళ్ల వయసున్నప్పుడు తొలి కాంట్రాక్ట్ దక్కింది. మెస్సీ ఆటను చూసి బార్సిలోనా స్పోర్టింగ్ డైరెక్టర్ కార్లెస్ రెక్సాచ్ ఫిదా అయిపోయారు. ఎలాగైనా మెస్సీని క్లబ్‌లోకి తీసుకోవాలని అనుకున్నారు. ఒక లంచ్ మీటింగ్‌లో అధికారిక బాండ్ పేపర్లు అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న ఒక 'నాప్కిన్ పేపర్' మీద మెస్సీతో తొలి అగ్రిమెంట్ రాయించారు. ఆ చారిత్రాత్మక నాప్కిన్ 2024లో జరిగిన వేలంలో ఏకంగా 9,65,000 డాలర్లకు (దాదాపు 8 కోట్ల రూపాయలు) అమ్ముడైంది.
3.కెరీర్‌ను దెబ్బతీయబోయిన హార్మోన్ లోపం..
మెస్సీ పదేళ్ల వయసులో 'గ్రోత్ హార్మోన్ డెఫిషియెన్సీ' (ఎత్తు పెరగకపోవడం) వ్యాధి బారిన పడ్డాడు. ఈ జబ్బు ట్రీట్మెంట్ కోసం నెలకు 900 డాలర్లు ఖర్చయ్యేది. అంత ఆర్థిక స్థోమత లేక మెస్సీ కుటుంబం, స్థానిక క్లబ్ చేతులెత్తేశాయి. ఆ సమయంలో బార్సిలోనా క్లబ్ అండగా నిలిచింది. మెస్సీ స్పెయిన్ వచ్చి తమ యూత్ అకాడమీ అయిన లా మాసియాలో చేరితే.. వైద్య ఖర్చులను తామే చెల్లిస్తామని ముందుకొచ్చింది.
2000లో స్పెయిన్‌కు మారడానికి ముందు మెస్సీ స్వదేశంలో 'నెవెల్స్ ఓల్డ్ బాయ్స్' అనే క్లబ్ తరపున యూత్ ఫుట్‌బాల్ ఆడేవాడు. అప్పట్లో ఆ టీమ్‌ను ‘ది మెషిన్ ఆఫ్ 87’ అని పిలిచేవారు. ఆ అకాడమీలో ఆరు ఏళ్లలోనే మెస్సీ ఏకంగా 500కు పైగా గోల్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. లోకల్ టోర్నమెంట్లలో మెస్సీ పేరు మారుమోగిపోయేది.
మైదానంలో మెస్సీ ప్రతిసారి గోల్ కొట్టాక రెండు చేతుల చూపుడు వేళ్లను ఆకాశం వైపు చూపిస్తూ సెలబ్రేట్ చేసుకోవడం చూసే ఉంటారు. మెస్సీ పదకొండేళ్ల వయసులో తన గ్రాండ్ మదర్ సెలియా చనిపోయారు. ఆమెకు నివాళిగా ఇలా సంబరాలు చేసుకుంటాడు. చిన్నతనంలో మెస్సీ కంటే వయసులోపెద్దగా ఉన్నవారితో మెస్సీని ఆడించమని కోచ్‌లతో గొడవపడి మరీ ఆమె ప్రోత్సహించారు.
6. రికార్డు స్థాయిలో 8 బ్యాలన్ డి ఓర్ అవార్డులు..
ఫుట్‌బాల్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'బ్యాలన్ డి ఓర్' (Ballon d'Or) అవార్డును మెస్సీ రికార్డు స్థాయిలో ఏకంగా ఎనిమిది సార్లు (2009, 2010, 2011, 2012, 2015, 2019, 2021, 2023) అందుకున్నాడు. ఫుట్‌బాల్ చరిత్రలో మరే ఆటగాడికీ ఇది సాధ్యం కాలేదు. ఆయనకు గట్టి పోటీ ఇచ్చే క్రిస్టియానో రొనాల్డో (5) కంటే మెస్సీ మూడు అవార్డుల ఆధిక్యంలో ఉన్నాడు.
ఫిఫా వరల్డ్ కప్ హిస్టరీలో రెండుసార్లు 'గోల్డెన్ బాల్' (టోర్నమెంట్ బెస్ట్ ప్లేయర్) అవార్డు గెలుచుకున్న ఏకైక ఫుట్‌బాలర్ మెస్సీనే. 2014లో అర్జెంటీనాను ఫైనల్ చేర్చినందుకు.. 2022లో ఖతార్‌లో వరల్డ్ కప్ ట్రోఫీని గెలిపించినందుకు మెస్సీని ఈ అవార్డు వరించింది.
ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా వరల్డ్ 2026 మెగా టోర్నీలో మెస్సీ సరికొత్త రికార్డు సృష్టించాడు. అల్జీరియాపై హాట్రిక్ గోల్స్, ఆస్ట్రియాపై రెండు గోల్స్‌తో వరల్డ్ కప్ కెరీర్లో మొత్తం 18 గోల్స్ కొట్టి.. అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్‌గా అవతరించాడు. జర్మనీ లెజెండ్ మిరొస్లావ్ క్లోజ్ (16 గోల్స్), బ్రెజిల్ ఉమెన్ లెజెండ్ మార్టా (17 గోల్స్) రికార్డులను బ్రేక్ చేశాడు.
9. యంగెస్ట్ అండ్ ఓల్డెస్ట్ అర్జెంటీనా స్కోరర్..
ఈ 2026 వరల్డ్ కప్‌లో మెస్సీ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. అర్జెంటీనా తరపున వరల్డ్ కప్‌లో గోల్ కొట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా (యంగెస్ట్), అలాగే అత్యంత వయస్కుడిగా (ఓల్డెస్ట్) రికార్డుల్లో నిలిచాడు.
10. రికార్డు బ్రేకింగ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్..
2022లో ఖతార్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మెస్సీ ట్రోఫీతో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌కు ఏకంగా 7.4 కోట్ల (74 మిలియన్) కంటే ఎక్కువ లైక్స్ రావడం విశేషం. ఇన్స్టాగ్రామ్ హిస్టరీలోనే ఒక కోడిగుడ్డు ఫోటో (World Record Egg) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టి.. అత్యధిక లైకులు సాధించిన ఫోటోగా ఇది వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది.