
CUET UG 2026| ఇంటర్నెట్‌డెస్క్: దేశ వ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన సీయూఈటీ (యూజీ) పరీక్షా ఫలితాల్లో భాజపా ఎమ్మెల్యే కైలాశ్ గహ్లోత్...
CUET UG 2026| ఇంటర్నెట్‌డెస్క్: దేశ వ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన సీయూఈటీ (యూజీ) పరీక్షా ఫలితాల్లో భాజపా ఎమ్మెల్యే కైలాశ్ గహ్లోత్ (Kailash Gahlot) కుమార్తె దేవినా జాతీయస్థాయిలో తొలి ర్యాంకు సాధించారు. తాజాగా వెల్లడైన ఫలితాల్లో ఆమె టాప్‌స్కోరర్‌గా నిలిచారు. మంచి ర్యాంకు వస్తుందని అనుకున్నానని.. కానీ, తొలిస్థానం దక్కించుకోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని ఆమె సంతోషం వ్యక్తంచేశారు.
‘‘జాతీయస్థాయిలో ఫస్ట్ ర్యాంకు ఇప్పటికీ కలగానే ఉంది. మళ్లీ మళ్లీ నా నంబర్ చెక్ చేసుకున్నాను. ప్రతి రోజూ ప్రతి సబ్జెక్ట్ చదివాను. ఒక అంశానికే పరిమితం కాలేదు. తరచూ రివిజన్ చేశాను. గత పేపర్లను సాధన చేశాను. బోర్డ్ ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత క్యూట్‌కు ప్రిపరేషన్ ప్రారంభించాను. నా భవిష్యత్తును నిర్ణయించే అంశం అది. ప్రిపరేషన్ విషయంతో కొంత టెన్షన్ పడ్డాను. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకెళ్లాను. నాకు సాహిత్యమంటే ఇష్టం. జర్నలిజంపైనా ఆసక్తి ఉంది. నా తండ్రి చేస్తోన్న సేవను చూసి.. రాజకీయాలపైనా ఇష్టం ఏర్పడింది’’ అని దేవినా మీడియాతో అన్నారు. కైలాశ్ గహ్లోత్.. దిల్లీ రవాణా, పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేశారు. 2024లో ఆమ్ఆద్మీపార్టీ నుంచి భాజపాలో చేరారు. బిజ్వాసన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తన కుమార్తె హార్డ్ వర్క్ వల్లే ఈ ర్యాంకు సాధ్యం అయిందని కైలాశ్ సంతోషం వ్యక్తంచేశారు.
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET UG)-2026 మే 11 నుంచి 31వ తేదీ మధ్య, జూన్ 6, 7 తేదీల్లో మొత్తం 19 రోజుల పాటు 35 షిఫ్టుల్లో నిర్వహించారు. మంగళవారం ఫలితాలను ప్రకటించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.