
ఉక్రెయిన్‌లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారత సైన్యాన్ని రంగంలోకి దించాలనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ప్రతిపాదనను అధ్యక్షుడు ట్రంప్ నవ్వుతూ కొట్టిపారేశారని, భారతీయులు దేనికీ పైసా ఖర్చు...
ఉక్రెయిన్‌లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారత సైన్యాన్ని రంగంలోకి దించాలనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ప్రతిపాదనను అధ్యక్షుడు ట్రంప్ నవ్వుతూ కొట్టిపారేశారని, భారతీయులు దేనికీ పైసా ఖర్చు పెట్టరు.. ఇలాంటి వాటికి అస్సలు డబ్బులు ఇవ్వరని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ఓ కొత్త పుస్తకం వెల్లడించింది.
వాషింగ్టన్, జూన్ 24: ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించే వ్యూహాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) మధ్య వైట్ హౌస్‌లో జరిగిన ఒక రహస్య భేటీకి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉక్రెయిన్‌లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారత సైన్యాన్ని రంగంలోకి దించాలనే జేడీ వెన్స్ ప్రతిపాదనను ట్రంప్ నవ్వుతూ కొట్టిపారేశారని, 'భారతీయులు దేనికీ పైసా ఖర్చు పెట్టరు.. ఇలాంటి వాటికి అస్సలు డబ్బులు ఇవ్వరు' అని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ఓ కొత్త పుస్తకం వెల్లడించింది. న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టులు మాగీ హేబర్మన్, జోనాథన్ స్వాన్ సంయుక్తంగా రాసిన 'రెజీమ్ చేంజ్' (Regime Change) అనే పుస్తకంలో ఈ ఆసక్తికరమైన సంభాషణను పొందుపరిచారు.
సదరు పుస్తకం ప్రకారం.. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన పది రోజులకే, అంటే 2025 జనవరి 30న వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో ఒక కీలక సమావేశం జరిగింది. ఉక్రెయిన్-రష్యా శాంతి రాయబారిగా ట్రంప్ నియమించిన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కీత్ కెల్లాగ్ ఈ భేటీని ఏర్పాటు చేశారు. యుద్ధాన్ని ముగించడానికి ఆయన 'ఆన్ అమెరికా ఫస్ట్ ప్లాన్' పేరిట ఒక ముసాయిదా ప్రణాళికను సిద్ధం చేశారు.
ఈ ప్లాన్ ప్రకారం.. ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగాలపై రష్యా హక్కులను అమెరికా అధికారికంగా గుర్తించదు. అదే సమయంలో, ఆ ప్రాంతాలను బలవంతంగా తిరిగి స్వాధీనం చేసుకోబోమని ఉక్రెయిన్ అంగీకరించాలి. ఈ కాల్పుల విరమణ (Ceasefire) ను పర్యవేక్షించడానికి సరిహద్దుల్లో విదేశీ శాంతిభద్రతల సైన్యాన్ని మోహరించాలని కెల్లాగ్ ప్రతిపాదించారు.
జేడీ వాన్స్ అభ్యంతరం.. భారత్ పేరు తెరపైకి!
కెల్లాగ్ తన ప్లాన్‌లో బ్రిటన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ వంటి యూరోపియన్ దేశాల సైన్యాన్ని ఉక్రెయిన్‌కు పంపవచ్చని పేర్కొన్నారు. అయితే దీనిని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. నాటో (NATO) కూటమి దేశాల సైన్యం ఉక్రెయిన్ సరిహద్దుల్లో అడుగుపెడితే, దానిని రష్యా తీవ్రమైన ఉసిగొల్పు చర్యగా భావిస్తుందని, దీనివల్ల యుద్ధం మరింత పెరిగి అమెరికా కూడా నేరుగా రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు.
యూరోపియన్ దేశాలకు ప్రత్యామ్నాయంగా నాటోతో సంబంధం లేని దేశాల సైన్యాన్ని పరిశీలించాలని జేడీ వాన్స్.. జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్జ్ను కోరారు. ఇందుకు వాల్ట్జ్ కూడా అంగీకరించడంతో.. రష్యాకు నమ్మకమైన మిత్రదేశంగా ఉన్న భారత్, అలాగే సౌదీ అరేబియా దేశాల సైన్యాన్ని శాంతిభద్రతల పర్యవేక్షణకు వాడుకుంటే ఎలా ఉంటుందని జేడీ వెన్స్ ప్రతిపాదించారు.
'మోదీ నాకు మంచి దోస్తే.. కానీ భారతీయులు రూపాయి తీయరు'
జేడీ వెన్స్ నోటి నుంచి భారత్ పేరు రాగానే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నవ్వేస్తూ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకు అత్యంత బలమైన సంబంధాలు ఉన్నాయని, మోదీకి తనంటే చాలా ఇష్టమని, ఆయన త్వరలోనే అమెరికా పర్యటనకు రావాలని అనుకుంటున్నారని ట్రంప్ పేర్కొంటూనే.. అసలు విషయానికొచ్చారు. 'భారతీయులు ఎప్పటికీ దేనికీ డబ్బులు చెల్లించరు. ఇలాంటి సైనిక మిషన్ల కోసం వారు రూపాయి కూడా ఖర్చు పెట్టరు' అని ట్రంప్ స్పష్టం చేశారు.
అయితే, బ్రిటన్ లేదా ఫ్రాన్స్ దేశాలు తమ స్వంత ఖర్చులతో, అమెరికాకు ఎలాంటి ఆర్థిక లేదా సైనిక భారం పడకుండా ఉక్రెయిన్‌కు సైన్యాన్ని పంపుతామంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ట్రంప్ తేల్చి చెప్పారు.
అదే సమయంలో ఉక్రెయిన్ నాయకత్వంపై ట్రంప్ ప్రభుత్వానికి ఉన్న అవిశ్వాసం ఈ భేటీలో స్పష్టంగా కనిపించిందని పుస్తకం పేర్కొంది. సమావేశం జరుగుతున్నంత సేపూ ట్రంప్ మధ్యలో కల్పించుకుంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీపై తీవ్ర విమర్శలు చేశారు. జెలెన్స్కీ ఒక 'అట్టర్ ఫ్లాప్ నెగోషియేటర్' అని, ఆయన తన చేతులతో తన దేశాన్ని సర్వనాశనం చేసుకున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే జో బైడెన్ ప్రభుత్వం నుంచి ఉచితంగా ఆయుధాలు, నిధులు రాబట్టడంలో మాత్రం జెలెన్స్కీ మహా దిట్ట అని ట్రంప్ ఎద్దేవా చేశారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతిమయమైన దేశం ఉక్రెయిన్ అని కూడా ట్రంప్ ఈ సందర్భంగా అన్నట్లు పుస్తకంలో రచయితలు రాసుకొచ్చారు.
Read Latest AP News And Telangana News And International News And Telugu News