తిరుమల శ్రీవారిని దర్శనం కోసం నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. టీటీడీ భక్తుల కోసం దర్శనాల టికెట్లను ప్రతి నెలా ఆన్లైన్లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
మూడు నెలల క్రితం ఆన్లైన్లో దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు.. తీరా తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తే ఊహించని పరిస్థితి ఎదురైంది. దాదాపు 300మంది భక్తులు ఇబ్బందిపడ్డారు. ఈ నెల 23న శ్రీవారి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను భక్తులు మూడు నెలలకు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. ఈ టికెట్లు తీసుకుని భక్తులు దర్శనం కోసం తిరుమలకు వచ్చారు.భక్తులకు జారీ చేసిన శ్రీవాణి టికెట్లలో దర్శన సమయం సాయంత్రం 4 గంటలకు బదులుగా ఉదయం 4 గంటలుగా ముద్రించారు. భక్తులు టికెట్‌పై ఉన్న సమయాన్ని చూసుకుని మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకే దర్శనం కోసం తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్-1 దగ్గరకు వచ్చారు. అక్కడ దర్శన టికెట్లను పరిశీలించిన టీటీడీ సిబ్బంది సాయంత్రం 4 గంటలు బదులుగా ఉదయం 4 గంటలకు దర్శమని తప్పుగా ముద్రించినట్లు గుర్తించారు. దీంతో కొంతసేపు గందరగోళం నెలకొంది.ఈ తప్పును గమనించి స్పందించిన టీటీడీ ఉన్నతాధికారులు ఆ భక్తులందరికి.. రెఫరల్ ప్రొటోకాల్ వీఐపీ బ్రేక్‌లో శ్రీవారి దర్శనం చేయించారు. శ్రీవాణి ట్రస్ట్ దాతల విభాగం సిబ్బంది చేసిన పొరపాటుతో టికెట్లో సమయం మారిందని చెబుతున్నారు. ఈ తప్పును గమనించి 200 మంది భక్తులకు గతంలోనే వేళలు మార్చామన్నారు. వేకువజామున దర్శనం కోసం వచ్చిన మిగిలిన 300 మందికి ప్రత్యామ్నాయ దర్శనం కల్పించామని టీటీడీ అధికారులు తెలిపారు. మొత్తం మీద శ్రీవాణి దర్శన టికెట్ల జారీ సమయంలో జరిగిన తప్పుతో 300 మంది భక్తులు ఇబ్బందిపడ్డారు.. టీటీడీ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడంతో దర్శనం సాఫీగా జరిగింది.వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలుఅప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందుగా నిర్వహించే పవిత్రమైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మంగళవారం అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా జరిగింది. జూన్ 24 నుండి జూలై 3 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక శోభను మరింత పెంపొందించే ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, అర్చన అనంతరం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఆలయ గర్భగుడి, ప్రాకారాలు, గోడలు, పైకప్పు, పూజా సామగ్రిని శుద్ధి చేసి, నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం, కుంకుమ, కిచిలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షించారు. ఈ పవిత్ర కార్యక్రమంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక సుగంధాలతో పరిమళించి, భక్తిమయ వాతావరణాన్ని సంతరించుకుంది. అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు.వార్షిక బ్రహ్మోత్సవాలకు నాంది పలుకుతూ జూన్ 24న రాత్రి 7.30 గంటలకు అంకురార్పణం నిర్వహించనున్నారు. జూన్ 25న ధ్వజారోహణంతో సకల దేవతలను ఆహ్వానిస్తూ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. ఉత్సవాల్లో భాగంగా జూన్ 28న ఆర్జిత కల్యాణోత్సవం, జూన్ 29న గరుడసేవ, జూలై 2న రథోత్సవం, జూలై 3న చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలను ముగించనున్నారు. ఈ దివ్య బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.