
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు దిగొస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర (Oil Prices) నాలుగు నెలల కనిష్ఠానికి పడిపోయింది.
అటు బంగారం (Gold Rates), వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. అమెరికా డాలర్ విలువతో పాటు అక్కడ బాండ్ రాబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ లోహాలకు గిరాకీ తగ్గింది. దీంతో వీటి ధరలు పతనమవుతున్నాయి.
బుధవారం ఉదయం 9.30 గంటల సమయానికి అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాముల) బంగారం (Gold) ధర దాదపు 70 డాలర్లు తగ్గి 4057 డాలర్లకు పరిమితమైంది. ఔన్సు వెండి ధర 60.95 డాలర్లు పలికింది. ఫలితంగా హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్ల) బంగారం ధర దాదాపు రూ.2000 క్షీణించి రూ.1,47,100కు దిగొచ్చింది. కిలో వెండి (Silver) ధర దాదాపు రూ.4వేలు తగ్గి రూ.2.29లక్షలు పలికింది.
మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలోనూ ఈ లోహాల ధరలు 1శాతం మేర క్షీణించాయి. గోల్డ్ ఆగస్టు ఫ్యూచర్స్‌లో 10 గ్రాముల ధర రూ.1,44,759గా ఉంది. జులై ఫ్యూచర్స్‌లో వెండి కిలో ధర రూ.2.24లక్షలుగా ట్రేడ్ అవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని ఫెడ్ సంకేతాలిచ్చింది. దీంతో డాలర్ ఇండెక్స్ తొలిసారి 100 మార్క్ దాటింది. ఈ క్రమంలోనే బంగారం, వెండిలో పెట్టుబడులను మదుపర్లు వెనక్కి తీసుకుంటున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ మార్కెట్లో బుధవారం ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. బ్రెంట్ క్రూడ్ (Brent Crude Oil) బ్యారెల్ ధర నాలుగు నెలల కనిష్ఠానికి తగ్గి 76.54 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ క్రూడ్ బ్యారెల్ ధర 72.69 డాలర్లకు దిగొచ్చింది. హర్మూజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలు మొదలవడం, ఇరాన్ చమురుకు అమెరికా ఆంక్షల మినహాయింపుల వంటి కారణాలతో మార్కెట్లో చమురు లభ్యత పెరిగింది. దీంతో వీటి ధరలు దిగొస్తున్నాయి. రానున్న రోజుల్లో చమురు ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అదే జరిగితే భారత్‌పై దిగుమతుల భారం తగ్గుతుంది. ఫలితంగా రూపాయి విలువ పుంజుకోవడంతో పాటు ద్రవ్యోల్బణ భయాలు వీడుతాయి. అయితే, ఈ పరిణామాలతో సామాన్య వినియోగదారులకు తక్షణ ఊరట లభించే అవకాశం లేదు. రిటైల్ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గేందుకు కొంతకాలం వేచి చూడక తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.