
హైదరాబాద్: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన హాస్య, విలక్షణ నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన ప్రముఖ సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్‌ను అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మశ్రీ’ వరించింది.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అత్యంత వైభవంగా జరిగిన రెండవ విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. దశాబ్దాలుగా తన అద్భుతమైన నటనతో తెలుగు చలనచిత్ర రంగానికి చేసిన విశేష సేవలను, అలాగే ఆయన మైలురాయి లాంటి సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయనను ఈ అత్యున్నత గౌరవంతో సత్కరించింది. ఈ పురస్కారంతో జాతీయ స్థాయిలో తెలుగు సినిమా కీర్తి మరోసారి వెలిగింది. రాజేంద్రప్రసాద్ టాలీవుడ్లో కేవలం కామెడీ హీరోగానే కాకుండా, ఎన్నో సందేశాత్మక , భావోద్వేగ ప్రధానమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. వెండితెరపై ఆయన పండించే నవ్వులు, చూపించే హావభావాలు తరాల తరబడి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ప్రదర్శన కళల రంగానికి ఆయన అందించిన నిరంతర సేవలకు గానూ ఈ 'పద్మశ్రీ' పురస్కారం దక్కడం పట్ల తెలుగు సినీ ప్రముఖులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జననం , విద్యాభ్యాసం.. రాజేంద్రప్రసాద్ (పూర్తి పేరు గద్దె బాబు రాజేంద్రప్రసాద్) 19 జులై 1956న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నిమ్మకూరులో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి గద్దె వెంకట నారాయణ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తల్లి మాణిక్యంబ. రాజేంద్ర ప్రసాద్ సెరామిక్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు. సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో నటన నేర్చుకునే పాఠశాలలో చేరి శిక్షణ తీసుకున్నారు. కుటుంబ జీవితం... రాజేంద్రప్రసాద్ వివాహం విజయ చాముండేశ్వరితో జరిగింది. ఈమె ప్రముఖ సీనియర్ నటి రమాప్రభ దత్తత కుమార్తె. వీరికి ఒక కుమారుడు (బాలాజీ ప్రసాద్), ఒక కుమార్తె (గాయత్రి) ఉన్నారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆయన కుమార్తె గాయత్రి అక్టోబర్ 2024లో గుండెపోటుతో మరణించారు. సినీ ప్రస్థానం... 1977లో 'స్నేహం' సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన, 'మంచు పల్లకి' (1982) చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత లేడీస్ టైలర్, ఆహా నా-పెళ్లంట, అప్పుల అప్పారావు, మాయలోడు వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ కామెడీ చిత్రాలతో టాలీవుడ్లో టాప్ హీరోగా ఎదిగి, ప్రేక్షకులతో 'నటకిరీటి' అని పిలిపించుకున్నారు. కేవలం హాస్యమే కాకుండా ఎర్ర మందారం, ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి, ఓనమాలు వంటి చిత్రాల్లో సీరియస్ పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అవార్డులు - పురస్కారాలు... ఆయన నటనకు గానూ ఏపీ ప్రభుత్వం నాలుగు ప్రతిష్టాత్మక నంది అవార్డులను (ఎర్ర మందారం , ఆ నలుగురు చిత్రాలకు ఉత్తమ నటుడిగా) అందుకున్నారు. వీటితో పాటు మూడు సైమా (SIIMA) అవార్డులు, సంతోషం ఫిల్మ్ అవార్డులు , ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ను కూడా పొందారు. కెనడా తెలుగు అసోసియేషన్ ఆయనను 'హాస్య కిరీటి' బిరుదుతో సత్కరించారు. 2015 లో ఆయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడిగా కూడా సేవలందించారు.