
పాలమూరుపై హైదరాబాద్ ఘనవిజయం మెరిసిన అజయ్, యశ్వీర్, గణేశ్, అన్విత్ ఈనాడు - హైదరాబాద్ టీజీ20 లీగ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ తొలి అడుగు బలంగా పడింది.
ఆరంభ పోరులో ఆ జట్టు అంచనాలను అందుకుంటూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. మొదట బంతితో పాలమూరు స్ట్రైకర్స్‌ను కట్టడి చేసిన ఈ ఛాంపియన్స్.. తర్వాత బ్యాటుతోనూ సత్తా చాటి లీగ్‌లో ఘనంగా బోణీ కొట్టింది. పాలమూరు వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది.
కాస్త కంగారుపడ్డా..: చివరికి ఘనంగానే గెలిచినా.. హైదరాబాద్ ఛేదన అంత సాఫీగా ఏమీ సాగలేదు. రెండో ఓవర్లోనే ఓపెనర్ సాయివికాస్ (1) వికెట్‌ను కోల్పోయింది ఛాంపియన్స్. అయితే మూడో ఓవర్లో కెప్టెన్ అభిరథ్‌రెడ్డి 2 సిక్సర్లు, 3 ఫోర్లు బాది 24 పరుగులు రాబట్టాడు. తర్వాతి ఓవర్లోనే అతనూ ఔటయ్యాడు. బౌలింగ్‌లో రాణించిన యశ్వీర్ (3) కూడా తక్కువకే వెనుదిరిగాడు. దీంతో పవర్‌ప్లే ఆఖరికి ఈ ఛాంపియన్స్ 55/3తో నిలిచింది. ఈ స్థితిలో అన్విత్ రెడ్డి, గణేశ్ ఆచితూచి ఆడారు. లక్ష్యం చిన్నది కావడంతో ఈ ఇద్దరూ కంగారు పడలేదు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ, వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ తరలించారు. మొదట్లో జాగ్రత్తగా ఆడిన గణేశ్.. తర్వాత చెలరేగాడు. 11వ ఓవర్లో అన్విత్ రెండు ఫోర్లు.. గణేశ్ ఓ ఫోర్, సిక్స్ బాది 21 పరుగులు రాబట్టారు. అసలే చిన్న లక్ష్యం.. ఆ ఓవర్ తర్వాత ఇంకా చిన్నదైంది. అన్విత్, గణేశ్ పోటాపోటీగా షాట్లు ఆడుతూ లక్ష్యాన్ని కరిగించారు. ఈ క్రమంలో గణేశ్ 30 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. సిక్స్‌తో జట్టుకు విజయాన్ని అందించడమే కాక అర్ధశతకాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు అన్విత్.
మ్యాచ్ సందర్భంగా ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి, ఈటీవీ డైరెక్టర్ సుజయ్
బౌలర్లు సమష్టిగా..: మొదట హైదరాబాద్ బంతితో అద్భుత ప్రదర్శన చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆ జట్టు.. ముందు రోజు వర్షం వల్ల కొంచెం మందకొడిగా తయారైన పిచ్‌ను పూర్తిగా ఉపయోగించుకుంది. పేసర్ అజయ్‌దేవ్ గౌడ్.. స్పిన్నర్లు యశ్వీర్ గౌడ్, ప్రణవ్ వర్మ పాలమూరు బ్యాటర్లకు ఏమాత్రం అవకాశమివ్వలేదు. ఓపెనర్ చైతన్య (5) విఫలం కాగా.. గత మ్యాచ్‌లో అర్ధసెంచరీ చేసిన విఘ్నేశ్, మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఔటయ్యాడు. 9వ ఓవర్లో గణేశ్ గడుగు ఓ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో.. కెప్టెన్ ప్రజ్ఞయ్ (9) వెనుదిరిగాడు. రోహిత్ రాయుడు, అఫ్రిది (2) స్వల్ప వ్యవధిలో ఔటవడంతో పాలమూరు ఇబ్బందుల్లో పడింది. పన్వర్ పోరాడినా.. అతడికి సహకరించేవారు కరవయ్యారు. అజయ్‌దేవ్ విజృంభించడంతో చివరి 18 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయిన స్ట్రైకర్స్ 141 పరుగులకే ఆలౌటైంది.
హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ తొలి విజయం సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉషోదయ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ సాంబశివరావు, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి, ఈటీవీ డైరెక్టర్ సుజయ్ జట్టు సభ్యులను అభినందించారు. సూపర్ బౌలింగ్‌తో ఆకట్టుకున్న అజయ్‌దేవ్ గౌడ్‌కు రామోజీ ఫిలింసిటీలో రెండు రోజులు విహరించేలా బహుమతి ప్రకటించారు. మ్యాచ్‌లో నాలుగు వికెట్ల ప్రదర్శన లేదా సెంచరీ చేసిన ఈ ఛాంపియన్స్ ఆటగాళ్లందరికీ ఈ అవకాశం కల్పిస్తామని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.