
జూలూరుపాడు, జూన్ 23 : ప్రస్తుత సమాజంలో డిగ్రీ పట్టా చేతికి రాగానే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగడం, నోటిఫికేషన్లు రాక నిరాశతో నిస్పృహకు లోనవ్వడం ఒక సాధారణ దృశ్యం.
కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని భగత్ సింగ్ కాలనీ, వెంగన్నపాలెం కాలనీ యువత మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించారు. "ఉద్యోగం వచ్చే వరకు వేచి చూడడం కాదు.. ఉపాధిని తామే సృష్టించుకోవాలనే దృఢ సంకల్పంతో వారు సాగిస్తున్న ప్రయాణం ఒక సామాజిక అధ్యయనంగా మారింది. ఉద్యోగం రాలేదు అని ఉరి వేసుకునే యువత ఉన్న ఈ రోజుల్లో ఉపాధి ఉంది.. దాన్ని పట్టుకునే సత్తా తమకుందని నిరూపిస్తున్న భగత్ సింగ్ కాలనీ పెయింటర్లు జీవిత సమర రంగంలో సహాయం కోసం వెతుక్కోకుండా తమ స్వంత శక్తిపైనే ఆధారపడుతూ పలువురికి నిజమైన స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తున్నారు. వారి చేతుల్లోని బ్రష్ కేవలం గోడలకు రంగులు వేయడమే కాక వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తోంది.
నైపుణ్యమే ఆయుధంగా.. సామాజిక అడ్డంకులపై విజయం ఒకప్పుడు దళిత వాడలుగా పిలవబడే ప్రాంతాల్లో కేవలం శారీరక శ్రమతో కూడిన కూలీ పనులే ఉపాధికి ఏకైక మార్గంగా ఉండేవి. కానీ భగత్ సింగ్ కాలనీలోని 100 కుటుంబాలకు చెందిన యువత ఆ చట్రాన్ని ఛేదించారు. కేవలం అక్షరజ్ఞానమే కాకుండా వృత్తి నైపుణ్యం ఉంటే ఎక్కడైనా బతకవచ్చని నిరూపిస్తున్నారు. ఇక్కడ దాదాపు 50 మందికి పైగా యువకులు పెయింటింగ్ రంగాన్ని తమ జీవనోపాధిగా మార్చుకున్నారు. వెంగన్నపాలెం కాలనీలో సైతం చాలామంది యువకులు పెయింటర్లుగా మారారు.
ఈ కాలనీలో పెయింటింగ్ బ్రష్ పట్టిన వారిలో 30 మందికి పైగా ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన వారు ఉండటం గమనార్హం. సాధారణంగా ఉన్నత చదువులు చదివిన వారు పెయింటింగ్ వంటి పనులను తక్కువగా చూసే ప్రమాదం ఉంది. కానీ, ఇక్కడి యువత ఆ సామాజిక మొహమాటాన్ని పక్కన పెట్టి, శ్రమ, గౌరవానికి పట్టం కట్టారు. బయట కూలీకి వెళ్తే రూ.500 మించని ఆదాయం, పెయింటింగ్‌లో నైపుణ్యం చూపడం వల్ల రోజుకు రూ. 800 నుండి రూ.1,000 వరకు లభిస్తోంది. కేవలం నగరాలకే పరిమితం కాకుండా తమ సొంత గ్రామంలో ఉంటూనే చుట్టుపక్కల ప్రాంతాల్లో పనులు చేసుకుంటూ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.
[caption id="attachment_2429268" align="alignnone" width="1200"] ఉద్యోగాల కోసం ఎదురుచూడక భగత్ సింగ్ కాలనీ యువత ‘ఉపాధి’ బాట[/caption] ఈ మార్పు ఒక్క రోజులో రాలేదు. తొలుత బుడిపుడి ప్రభాకర్, రమేష్, నరసింహారావు, పవన్,బాలు వంటి వారు నగరాల్లో కష్టపడి పని నేర్చుకుని గ్రామానికి తిరిగి వచ్చి తోటి యువతకు మార్గదర్శకులయ్యారు. ఇప్పుడు ఈ కాలనీ యువత వేసిన రంగులు ఖమ్మం, కొత్తగూడెం దాటి హైదరాబాద్ మహానగరం వరకు విస్తరించాయి. సీజన్లలో వ్యవసాయం చేస్తూ, మిగిలిన సమయంలో పెయింటింగ్ చేస్తూ ‘బహుళ ఉపాధి’ మార్గాలను వీరు ఎంచుకోవడం విశేషం.
వృత్తి పట్ల నిబద్ధత ఉన్న ఇటువంటి యువతను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు పెయింటర్లు పేర్కొంటున్నారు. ఆధునిక ‘స్ప్రే పెయింటింగ్’ అలాగే ‘టెక్స్చర్ డిజైనింగ్’లో శిక్షణ ఇప్పించి రాయితీపై ఆధునిక పెయింటింగ్ మెషీన్లను అందిస్తే తమ పని మరింత వేగవంతం అవుతుందంటున్నారు. తమందరినీ ఒక ‘మల్టీ-పర్పస్ లేబర్ సొసైటీ’గా ఏర్పాటు చేసి, ప్రభుత్వ భవనాల పెయింటింగ్ పనులను నేరుగా అప్పగిస్తే దళిత యువత ఆర్థికంగా మరింత బలోపేతం అవుతామని పేర్కొంటున్నారు.
[caption id="attachment_2429269" align="alignnone" width="1200"] ఉద్యోగాల కోసం ఎదురుచూడక భగత్ సింగ్ కాలనీ యువత ‘ఉపాధి’ బాట[/caption]