గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఐపీఎల్ 2025, 2026లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన రిషభ్ పంత్ .. తిరిగి సొంత గూటికి చేరాడు.
స్వాప్ డీల్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి వచ్చాడు. ఇదే సమయంలో డీసీ స్పిన్నర్ కుల్దీప్ యదావ్.. లక్నోలోకి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన రెండు ఫ్రాంఛైజీలు, ఐపీఎల్ నిర్వహకులు అధికారిక ప్రకటన చేశారు.ఐపీఎల్ 2025 వేలంలో రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లు వెచ్చించి.. లక్నో సూపర్ జెయింట్స్ రిషభ్ పంత్‌ను దక్కించుకుంది. కెరీర్ ఆరంభం నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఉన్న పంత్.. ఉన్నట్లుండి ఫ్రాంఛైజీతో విభేధాలతో వేలంలోకి వచ్చాడు. భారీ ధరకు అతడిని దక్కించుకున్న లక్నో.. సారథ్య బాధ్యతలు అప్పగించింది. కానీ రిషబ్ పంత్ అంచనాలను అందుకోలేకపోయాడు. సారథిగా, ఆటగాడిగా దారుణంగా విఫలమయ్యాడు. దానికి తోడు అధిక ప్రైజ్ ట్యాగ్ కూడా అతడిని ఇబ్బందిగా మారింది. పంత్ సారథిగా ఉన్న గత రెండు సీజన్లలో లక్నో.. కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరలేదు. దీంతో ఐపీఎల్ 2026 లీగ్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత పంత్.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. తాజాగా జట్టును వీడాడు.పంత్ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య స్వాప్ డీల్ జరిగింది. ఈ కొత్త డీల్‌లో భాగంగా జీతంలో భారీకోతకు రిషభ్ అంగీకరించాడు. ఈ సీజన్లో లక్నో అతడికి రూ. 27 కోట్లు చెల్లించింది. కానీ వచ్చే సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అతడికి రూ. 15 కోట్లు మాత్రమే ఇవ్వనుంది. ఇక కుల్దీప్ యాదవ్‌ను డీసీ నుంచి లక్నో తీసుకుంది. ప్రస్తుతం అతడి ఫీజు రూ. 13.50 కోట్లు కాగా.. అదే ధరకు లక్నో సొంతం చేసుకుంది.రిషభ్ పంత్.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 2016 నుంచి 2024 వరకు ఆడాడు. 111 మ్యాచులలో ప్రాతినిధ్యం వహించాడు. డీసీ తరఫున 43 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. కానీ 2024 సీజన్ తర్వాత డీసీ మేనేజ్మెంట్తో విబేధాల కారణంగా జట్టును వీడాడు. ఇక లక్నోకు వచ్చాక అతడి ప్రదర్శన దారుణంగా పడిపోయింది. గత సీజన్లో అతడు 14 మ్యాచ్‌లలో కలిపి కేవలం 269 రన్స్ మాత్రమే స్కోరు చేశాడు. పంత్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ ఇస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.