ITR Filing: ఈ ఆర్థిక సంవత్సరం 2026- 27 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 అమలులోకి వచ్చింది. చాలా నిబంధనలు మారాయి. దీంతో పన్ను చెల్లింపుదారుల్లో ఒక కొత్త గందరగోళం మొదలైంది.
ఇప్పటి వరకు ఉన్న అసెస్మెంట్ ఇయర్ (AY), ఫైనాన్షియల్ ఇయర్ (FY) స్థానంలో కొత్తగా ట్యాక్స్ ఇయర్ (TY) అనే పదం అమలులోకి తీసుకొచ్చారు. దీంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ పన్ను చెల్లింపుదారులు ఒకేసారి రెండు ఐటీ రిటర్నులు (AY 2026- 27, TY 2026- 27) దాఖలు చేయాలా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఆదాయపు పన్ను శాఖ స్పష్టమైన వివరణ ఇచ్చింది. 2 ఐటీ రిటర్నులు ఫైల్ చేయాలా?ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన కర్ సేతు అనే గైడ్ లైన్ బుక్ లో దీనిపై స్పష్టత ఇచ్చింది. పన్ను చెల్లింపుదారులు రెండు రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేదు అని తెలిపింది. పాత ఆదాయపు పన్ను చట్టం 1961 తరహాలోనే కొత్త చట్టంలోనూ పన్ను విధింపు విధానం కొనసాగుతుందని, ఎలాంటి అదనపు భారం ఉండదని తెలిపింది. ఐటీ శాఖ వివరణ ప్రకారం 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31వ తేదీ వరకు సంపాదించిన ఆదాయానికి పాత పద్ధతి ప్రకారం అసెస్మెంట్ ఇయర్ 2026- 27 గానే పరిగణిస్తారు. ఈ ఆదాయానికి పాత ఆదాయపు పన్ను చట్టం 1961 నిబంధనలే వర్తిస్తాయి. మీ కేటగిరీని బట్టి దీనికి జులై 31, ఆగస్టు 31, అక్టోబర్ 31 అంటూ గడువు తేదీలు ఉంటాయి. అయితే, 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు సంపాదించే ఆదాయానికి కొత్త పన్ను చట్టం ప్రకారం ట్యాక్స్ ఇయర్ 2026-27గా పిలుస్తారు. ఈ రిటర్నును మీరు ఇప్పుడు కాదు, వచ్చే ఏడాది అంటే 2027లో దాఖలు చేయాల్సి ఉంటుంది. దీనికి 2027 జులై 31, ఆగస్టు 31, అక్టోబర్ 31 అనే డెడ్ లైన్స్ ఉంటాయి. సరళంగా చెప్పాలంటే కొత్తగా వచ్చే ట్యాక్స్ ఇయర్ 2026- 27 రిటర్నులు దాఖలు చేయాల్సిన బాధ్యత ఆ పన్ను సంవత్సరం ముగిసిన తర్వాతే వస్తుంది. దీనికి సంబంధించిన ఐటీఆర్ ఫారాలను ప్రభుత్వం గడువు తేదీల కంటే ముందే నోటిఫై చేస్తుంది. కాబట్టి ట్యాక్స్ పేయర్లు ఎలాంటి కంగారు పడకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్నులను యథావిధిగా ఒకేసారి దాఖలు చేసుకుంటే సరిపోతుంది.