గత నెలలో తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి దళపతి జోసెఫ్ విజయ్ తీరిక లేకుండా ఉన్నారు . సోమవారం ఆయన 52వ పుట్టినరోజు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా విజయ్ మాతృమూర్తి శోభా చంద్రశేఖర్ ఓ ఇంటర్వ్యూలో తన కుమారుడి గురించి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తన తండ్రి ఎస్. ఏ. చంద్రశేఖర్‌ను మొదటగా విజయ్ అడిగిన ప్రశ్నకు సంబంధించి శోభా ఆ మాటలు చెప్పారు .తంతి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత జరిగిన కుటుంబంలో జరిగిన భావోద్వేగభరితమైన క్షణం గురించి ఆమె వెల్లడించారు. ‘‘ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ‘‘నేను మా నాన్న కలను నెరవేర్చానా?’’ అని అని విజయ్ అడిగారు.. కొడుకు ప్రశ్నకు ఆయన మౌనంగా తలూపారు.. గత రెండు దశాబ్దాలుగా విజయ్ ఈ పదవిని అధిరోహించాలని ఆయన కలలు కంటున్నారు’’ అని శోభా గుర్తుచేసుకున్నారు. తన కుమారుడి రాజకీయ ప్రవేశం సవాళ్లతో కూడుకున్నదని శోభ అన్నారు. ‘‘2009లో విజయ్ మక్కల్ ఇయక్కం ఏర్పాటైనప్పుడు నుంచే కుమారుడి రాజకీయ భవిష్యత్తును నా భర్త గమనిస్తూ వచ్చారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చినవారు విఫలమైన చరిత్ర ఉంది.. రాజకీయాల్లోకి రావాలని విజయ్ నిర్ణయం తీసుకున్నప్పుడు మా కుటుంబం మొదట్లో ఆందోళన చెందింది.. కానీ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విజయ్ అభిమానుల మద్దతును చూసిన తర్వాత తప్పక విజయం సాధించగలడనే నమ్మకం తమకు కలిగింది’’ అని శోభ చెప్పారు.రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన కుమారుడు ఎదుర్కొన్న విమర్శల గురించి కూడా ఆమె ప్రస్తావించారు. కెరీర్ ప్రారంభంలో చిత్రసీమలో ఎదుర్కొన్న తీవ్రమైన విమర్శలు, ఎగతాళిని రాజకీయ ప్రవేశం సమయంలో కూడా విజయ్ ఎదుర్కొన్నారని తెలిపారు. 2020లో తమ కుటుంబంలో తలెత్తిన చిన్నపాటి మనస్పర్థల గురించి కూడా వెల్లడించారు. ‘‘విజయ్‌పై విమర్శలకు మా కుటుంబం బాధపడింది. సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా ఇలాగే జరిగింది. కానీ తన ప్రయాణంలోని అన్ని దశల్లోనూ విజయ్ మౌనంగా ఉన్నారు. ప్రతీదాన్నీ సానుకూలంగా తీసుకున్నారు.. అదే చివరికి విజయానికి దారిచూపింది’’ అని ఆమె అన్నారు.అలాగే, నటన లేదా రాజకీయం ఈ రెండింటిలో ఏది తన మార్గమో మొదటి నుంచీ విజయ్2కు చాలా స్పష్టత ఉందని ఆమె పేర్కొన్నారు. ఫిబ్రవరి 2024లో రాజకీయాల్లోకి వచ్చిన విజయ్.. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పేరుతో సొంత పార్టీని ప్రారంభించారు. ఎలాంటి పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసిన టీవీకే.. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీకి అవతరించింది. సాధారణ మెజార్టీకి 10 సీట్ల దూరంలో నిలిచివడంతో కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. వెండితెర నుంచి రాజకీయాల్లోకి వచ్చి తొలి అడుగులో విజయం అందుకున్న ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజాల తర్వాత ఆ ఘనత సాధించిన వ్యక్తిగా విజయ్ నిలిచారు.